Delhi: రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన.. బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణ
- ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నట్టు తెలిసిందన్న ఆప్ మంత్రి అతిషి
- కేజ్రీవాల్ అరెస్ట్ అందులో భాగమేనని ఆరోపణ
- ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని మండిపాటు
- ఆప్ రోజుకో కథ అల్లుతోందని కౌంటర్ ఇచ్చిన బీజేపీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. ప్రస్తుతం ఆయన జుడీషియల్ రిమాండ్‌పై తీహార్ జైలులో ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, రోజుల వ్యవధిలో అమల్లోకి తీసుకొస్తారని ఆప్ కీలక నేత, మంత్రి అతిషి అన్నారు. సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని, ఈ మేరకు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.
కేజ్రీవాల్‌ను నకిలీ కేసులో అరెస్టు చేశారని, ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిగిన కుట్రలో కేజ్రీవాల్ అరెస్ట్ ఒక భాగమని, గతంలో జరిగిన పరిణామాలను చూస్తే బాగా ఆలోచించి కుట్ర చేసినట్టుగా తెలుస్తోందని అతిషి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఢిల్లీలో వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ కొన్ని నెలలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల భర్తీ నిలిచిపోయిందని అతిషి చెప్పారు.
కుట్రలో భాగంగా కేజ్రీవాల్ ప్రైవేటు సెక్రటరీని కూడా తొలగించారని మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీలో అధికారులను నియమించడం లేదని, బదిలీలు, పోస్టింగ్‌లు లేవన్నారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావడం కూడా మానేశారని అతిషి పేర్కొన్నారు. కాగా ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రోజుకో కొత్త కథ అల్లుతోందని కౌంటర్ ఇచ్చింది.