Nara Lokesh: లోకేశ్ ఫోన్ హ్యాకింగ్ పై సీఈసీకి లేఖ రాసిన కనకమేడల
- లోకేశ్ ఐఫోన్ ను హ్యాకింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆపిల్
- ఆ మేరకు లోకేశ్ కు అలర్ట్ మెసేజ్ లు
- మార్చి నెలలో కూడా లోకేశ్ కు అలర్ట్ లు వచ్చాయన్న కనకమేడల
- సీఈసీ చర్యలు తీసుకోవాలంటూ లేఖ
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ కు చెందిన ఐఫోన్ ను ట్యాపింగ్, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆపిల్ సంస్థ భద్రతా సందేశం పంపడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ విషయంపై టీడీపీ నాయకత్వం మండిపడుతోంది.
తాజాగా, లోకేశ్ ఫోన్ హ్యాకింగ్ అంశాన్ని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్ వేర్ సాయంతో లోకేశ్ ఫోన్ ను ట్యాప్ చేసినట్టు ఐఫోన్ నుంచి అలర్ట్ లు వచ్చాయని కనకమేడల కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశారు.
లోకేశ్ కు ఇలాంటి అలర్ట్ మెసేజ్ లే మార్చి నెలలో కూడా వచ్చాయని కనకమేడల సీఈసీకి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అధిపతి పీఎస్సార్ ఆంజనేయులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వారిద్దరి విషయం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చామని కనకమేడల తన లేఖలో వివరించారు. ఎన్డీయే కూటమిలోని నేతల పట్ల వారు వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.