IPL 2024: లక్నోకు సొంత మైదానంలో షాక్.. ఢిల్లీ ఘన విజయం!
- 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
- అర్ధ శతకం (55) తో రాణించిన మెక్‌గర్క్
- 24 బంతుల్లోనే 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రిషభ్ పంత్
- ఆయుష్ బదోనీ (55) శ్రమ వృథా
- ఢిల్లీకి రెండో విజయం.. లక్నోకు రెండో ఓటమి
లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో మెక్‌గర్క్ అర్ధ శతకం (55) తో రాణించగా, కెప్టెన్ రిషభ్ పంత్ 24 బంతుల్లోనే 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఓపెనర్ పృథ్వీ షా 32 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్ 28 పరుగుల వద్ద ఓపెనర్ క్వింటన్ డికాక్ (19) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (3), మార్కస్ స్టొయినిస్ (8) కూడా నిరాశపరిచారు. ఆదుకుంటాడనుకున్న నికోలాస్ పూరన్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన సారధి కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) పెవిలియన్ చేరాడు.
ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన దీపక్ హుడా (10) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా (3) కూడా వెనుదిరిగాడు. దీంతో పరుగులు చేశారు. దీంతో లక్నో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జట్టును యువ బ్యాటర్ ఆయుష్ బదోనీ ఆదుకున్నాడు. బదోనీ 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా హాఫ్ సెంచరీ (55) బాదాడు. మరో ఎండ్‌లో అర్షద్ ఖాన్ 16 బంతుల్లో 2 బౌండరీలతో 20 పరుగులు చేశాడు.
ఈ ద్వయం ఎనిమిదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. దాంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఢిల్లీకి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 168 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (08) ను యశ్ ఠాకూర్ పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత పృథ్వీ షా 22 బంతుల్లో 32 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పృథ్వీ షా తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్.. అప్పటికే క్రీజులో కుదురుకున్న మెక్‌గర్క్ తో జతకట్టాడు. ఈ జోడీ ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించింది. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
ఈ క్రమంలో అర్ధ శతకం (55) నమోదు చేసుకున్న మెక్‌గర్క్ ను నవీన్ ఉల్ హక్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రిషభ్ పంత్ 24 బంతుల్లో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కు కూడా తెర పడింది. కానీ, అప్పటికే డీసీ విజయం దాదాపు ఖాయమైపోయింది. మెక్‌గర్క్, పంత్ ద్వయం 77 పరుగుల భాగస్వామ్యం జోడించి ఢిల్లీ గెలుపునకు బాట వేశారు. చివరగా స్టబ్స్ (15 నాటౌట్), షై హోప్స్ (11 నాటౌట్) క్రీజులో నిలబడి 168 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. దాంతో ఢిల్లీ జట్టు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.
లక్నో బౌలర్లలో రవి బిష్ణోయి 2 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన డీసీ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్లో ఢిల్లీకి ఇది రెండో విజయం కాగా, లక్నో సూపర్ జెయింట్స్ కు రెండో ఓటమి.