Indians Jailed: హత్య కేసులో.. బ్రిటన్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు జీవితకాల జైలు శిక్ష

4 Indian origin men get life in jail for killing Indian delivery driver in UK
  • గతేడాది ఇంగ్లండ్‌లో భారత సంతతి డెలివరీ ఏజెంట్ దారుణ హత్య
  • వివిధ రకాల బ్యాట్లు, పలుగు, పారలతో బాధితుడిపై దాడి చేసిన భారత సంతతి నిందితులు
  • నిందితులందరికీ కలిపి మొత్తం 122 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
బ్రిటన్‌లో ఓ భారత సంతతి డ్రైవర్ హత్య కేసులో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు శుక్రవారం స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న ఆర్మాన్ సింగ్ గతేడాది దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ ఇంగ్లండ్‌లోని ష్రూస్ బెర్రీలో అతడిపై అర్షదీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివ్‌దీప్ సింగ్, మన్‌జ్యోత్ సింగ్ దారుణంగా దాడి చేశారు. గొడ్డలి, గోల్ఫ్ క్లబ్, మెటల్ క్లబ్, హాకీ స్టిక్, పార, హాకీ బ్యాట్‌, క్రికెట్ బ్యాట్, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అర్మాన్ సింగ్ కన్నుమూశాడు. ఘటన జరిగిన రోజు అర్మాన్‌దీప్ డెలివరీకి వస్తున్నాడన్న విషయాన్ని సుఖ్‌మన్‌దీప్ అనే మరో వ్యక్తి ఆ నలుగురికీ సమాచారం అందించాడు. కాగా, ఘటన జరిగిన కొన్ని రోజులకు నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అర్మాన్‌‌దీప్‌ను హత్య చేసిన నిందితులందరికీ కనీసం 28 ఏళ్ల చొప్పున, అర్మాన్‌దీప్ సమాచారం ఇచ్చిన వ్యక్తికి 10 ఏళ్ల చొప్పున మొత్తం అందరికీ కలిపి 122 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో నిందితులు హత్య చేశారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బహిరంగంగా బాధితుడిపై దాడి చేసి రక్తపుమడుగులో అతడిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. 

నిందితులందరికీ కఠిన శిక్షలు పడినందుకు స్థానిక పోలీసు ఉన్నతాధికారి హర్షం వ్యక్తం చేశారు. నిందితులు సుదీర్ఘకాలం జైలు గోడలకే పరిమితమవుతారని, సామన్యులకు వీరితో ఇకపై ఎటువంటి ప్రమాదం ఉండదని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. దారుణ నేరాలకు పాల్పడేవారు చట్టం నుంచి తప్పించుకోలేరని, ఇందుకు తాజా శిక్షలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
Indians Jailed
Murder Case
Britain
Crime News

More Telugu News