Chandrababu: అధికారంలోకి వచ్చిన వెంటనే నేను చేసే పని ఇదే: చంద్రబాబు
- గుంటూరు జిల్లా తాడికొండలో ప్రజాగళం సభ
- అమరావతి ముఖ్యాంశంగా చంద్రబాబు ప్రసంగం
- అమరావతిని కదల్చడం జగన్ వల్ల కాదని స్పష్టీకరణ
- ఈ ముఖ్యమంత్రి మళ్లీ అమరావతి జోలికి రాగలడా? అంటూ సవాల్
- అధికారం చేపట్టాక వెంటనే ప్రజావేదిక పునర్ నిర్మిస్తామని ప్రకటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం గుంటూరు జిల్లా తాడికొండలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి రాజధాని అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమరావతిని ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాల భూమి ఇచ్చారని వెల్లడించారు. అమరావతికి కేంద్రం కూడా సహకరించిందని తెలిపారు.
నాడు సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్ ను మహానగరంలా మార్చానని, హైదరాబాదులో 5 వేల ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించామని వివరించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉందంటే, ఆనాడు తాము వేసిన పునాదే కారణమని చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతిని కూడా హైదరాబాదుకు దీటుగా, దేశంలోనే నెంబర్ వన్ గా, ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి రాజధాని నగరంగా తయారుచేయాలని ప్రణాళికలు వేశానని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధానిగా చేయాలనుకున్నానని వెల్లడించారు. కానీ ఒక దిక్కుమాలినోడు వచ్చి ఏం చేయాలో అంతా చేశాడని వ్యాఖ్యానించారు.
అమరావతి ముహూర్త బలం విశిష్టమైనది
ఒకప్పుడు శాతవాహనులు ధరణికోట (అమరావతి)ను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. దేవతల రాజధాని కూడా అమరావతే. అలాంటి అమరావతి నగరం స్థాపించాలనుకున్నప్పుడు దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల నుంచి, అన్ని మసీదుల నుంచి, అన్ని చర్చిల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాను. జగన్ వంటి ఇలాంటి రాక్షసులు 100 మంది కాదు 1000 మంది వచ్చినా అమరావతి వెంట్రుక కూడా పీకలేరు. అమరావతి ముహూర్త బలం అది, అమరావతి స్థాన బలం అది.
తిక్కలోడు మూడు ముక్కలాట ఆడుతున్నాడు
జగన్ ఒక తిక్కలోడు... రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు. తానేం చెప్పినా జగన్ నమ్మేస్తారని అనుకుంటున్నాడు. నాలుగు భవనాలు కడితే రాజధాని పూర్తయినట్టా? రైతులు చేసిన త్యాగం, పోరాటం ఫలితంగానే అమరావతి రాజధానిగా నిలిచింది, గెలిచింది. విశాఖను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతాం, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తాం.
ఇవాళ తాడికొండ నుంచి ప్రకటిస్తున్నాం... ఏపీ రాజధాని అమరావతి. నాతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. నరేంద్ర మోదీ నాయకత్వంలో మేం అనుకుంటే అమరావతి రాజధాని సజావుగా జరుగుతుందనడంలో సందేహమే లేదు. ఈ ముఖ్యమంత్రి మళ్లీ అమరావతి జోలికి రాగలడా? అమరావతిని కదిలించే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా?
జూన్ 4న రెండు పనులు ఒకే రోజున జరుగుతాయి
జూన్ 4న సగర్వంగా ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకునే రోజు అది... సిద్ధమా? అదే రోజున జగనాసుర వధ, అమరావతి రక్షణ కూడా కూడా జరుగుతాయి. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. నాడు జగన్ అధికారంలోకి వచ్చాక, రూ.10 కోట్లతోమైన నిర్మితమైన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు. ఈ ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతోందో నాకు ఆ క్షణానే అర్థమైంది. మళ్లీ నేను వచ్చిన మరుక్షణమే ప్రజావేదిక పునర్ నిర్మిస్తాం. ప్రజా పాలనకు అక్కడ్నించే నాంది పలుకుతాం.
అసెంబ్లీలో సగర్వంగా అడుగుపెడతా
నాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనని శపథం చేశాను. ఇది కౌరవ సభ... మళ్లీ గెలిచిన తర్వాతే సభలోకి వస్తానని చెప్పాను. జూన్ 4న గెలిచి మళ్లీ సగర్వంగా అసెంబ్లీకి వెళతా. నిన్న, ఇవాళ వాళ్లు మీటింగులు పెట్టారు... ఒక్కో మీటింగ్ కు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 1500 బస్సులు... బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిళ్లు ఇచ్చారు.. క్వార్టర్ తాగి పడుకున్నారు కానీ మీటింగ్ కు వెళ్లలేదు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మన మీటింగులకు, ఆయన మీటింగులకు తేడా అది.
ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడొచ్చింది
ఒక్క అమరావతి విషయంలోనే కాదు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. అందరినీ ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. ఇక 30 రోజులే ఉంది... కక్ష తీర్చుకునే అవకాశం ప్రజల ముందుకు వచ్చింది.
సైకిల్ ఎక్కండి... టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి... ఒక గ్లాసు కూడా తీసుకోండి... ఎక్కడైనా దప్పికేస్తే నీళ్లు తాగండి, టీ తాగాలనిపిస్తే టీ తాగండి... పక్కనే కమలం పువ్వు కూడా పెట్టుకోండి, అందంగా ఉంటుంది. మీరు ముందుకు పొండి... సైకిల్ స్పీడ్ పెంచండి... అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లండి... కమలం వికాసం పెరుగుతుంది... ఎవరైనా గ్లాసు మీదికి వస్తే ఆ గ్లాసు వెళ్లి వాళ్ల గుండెల్లో చిక్కుకునేలా చేద్దాం.
ఇంకో నాలుగు టీవీలు పగలడం ఖాయం
ఈ మీటింగులు చూస్తే జగన్ మోహన్ రెడ్డికి నిద్ర రాదు... ఇంకో నాలుగు టీవీలు పగలగొడతాడు... జరిగేది ఇదే! రోజంతా ఖాళీగా ఉన్నాడు... టీవీలు చూసి పిచ్చెక్కుతుంది... దాంతో టీవీలు పగలగొడతాడు... ఆ సమయంలో ఎవరైనా వస్తే వారి తల పగలగొడతాడు.
ఆ ఏడు మండలాలు ఎలా తీసుకువచ్చామంటే...
రాష్ట్ర విభజన తర్వాత మేం గెలిచినప్పుడు తొలిరోజున ఢిల్లీ వెళ్లాను. ప్రధాని మోదీని, రాజ్ నాథ్ సింగ్ ను, వెంకయ్యనాయుడును పోలవరంపై ఒకే విషయం అడిగాను. తెలంగాణలో ఉండే ఏడు మండలాలు ముంపునకు గురవుతాయి. ఆ మండలాలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోతే పోలవరం ప్రాజెక్టుకు అనుమతి రాదు. ...మీరు ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే, తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు, మీరు నాకు ఆ ఏడు మండలాలు ఇస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆనాడు కేంద్రం పెద్దలకు చెప్పాను.
చరిత్రలో మొట్టమొదటిసారిగా... క్యాబినెట్ సమావేశం పెట్టి ఆర్డినెన్స్ తెచ్చి ఆ ఏడు మండలాలు మనకు ఇచ్చిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభించారు.
అలాకాకుండా, ఆనాడు నేను ఇక్కడ, కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి ఉంటే, ఆ ఏడు మండలాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అందుకు ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి, ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి... అది చరిత్రలో జరిగే పని కాదు. అలాంటి చాలా సమస్యలను, న్యాయపరమైన సమస్యలను కూడా పరిష్కరించి పోలవరం ప్రాజెక్టును పరిగెత్తించాను. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకువచి ఒకే సీజన్ లో 120 టీఎంసీలు తీసుకువచ్చి కృష్ణా డెల్టాను స్థిరీకరించిన పార్టీ టీడీపీ.
నన్ను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు
నాడు మేం పోలవరంలో 72 శాతం పనులు పూర్తి చేశాం... నేను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది. కానీ, రాష్ట్రంలో అధికారంలోకి ఒక దుర్మార్గుడు వచ్చాడు, ప్రజలు కూడా మోసపోయారు. నన్ను కాదనుకున్నారు. పాలిచ్చే మంచి ఆవును వదులుకుని, తన్నించుకోవడానికి ఒక దున్నుపోతును తెచ్చుకున్నారు. ఆ దున్నపోతు చేతిలో ఐదేళ్లు తన్నులు తిని అలిసిపోయాం, బక్కచిక్కిపోయాం... ఇప్పుడు పౌరుషం వచ్చింది... చేతికి అందిన రాయి తీసుకుని దున్నపోతును తరిమి తరిమి కొడదాం.. అంటూ చంద్రబాబు ప్రసంగించారు.