Revanth Reddy: లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం: సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy terms Kejriwal arrest was illegal
  • ఓ జాతీయ మీడియా సంస్థకు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ
  • ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయించిందని వ్యాఖ్యలు
  • ఈ కేసులో ఏం జరుగుతోందో దేశమంతా చూస్తోందని వెల్లడి
  • ఎన్నికల వేళ ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేయడం దేనికి సంకేతమన్న రేవంత్ 
ఓ జాతీయ మీడియా సంస్థకు వచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అక్రమం అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ కేజ్రీవాల్ అరెస్ట్ కు పూనుకుందని ఆరోపించారు. 

"ఈ కేసులో ఏం జరుగుతోందో యావత్ భారతదేశం గమనిస్తోంది. గత రెండేళ్లుగా ఈ కేసు నడుస్తోంది. సరిగ్గా ఎన్నికలు వచ్చేసరికి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. మరో రెండు నెలల తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఏమైనా తేడా కనిపిస్తుందా? 

దేశంలో ఎన్నికల వేడి మొదలైందో, లేదో... వెంటనే ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులు హేమంత్ సొరెన్, కేజ్రీవాల్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసు (లిక్కర్) చూస్తే ఓ టీవీ సీరియల్ లా సాగదీస్తున్నారు. అక్రమ నిర్బంధం మంచిది కాదు. 

ఈడీ వద్ద ఆధారాలు ఉంటే ఆ దర్యాప్తు సంస్థ రెండేళ్లుగా ఎందుకు మౌనంగా ఉంది? ఒకవేళ వాళ్ల వద్ద ఆధారాలేవీ లేకపోతే, సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ ప్రశ్నలకు మోదీ గారు సమాధానం చెప్పాలి. మోదీ గారు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో వ్యవహరిస్తున్న తీరు దేశానికి మంచిది కాదు. 

అవినీతికి పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోందో 140 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు... ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు దేశానికి వన్నె తెస్తాయా? 

అసలు, ఈ కేసులో కేజ్రీవాల్ పై ఉన్న ఆరోపణలు ఏంటి? అతడి పార్టీ గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఓ మద్యం వ్యాపారి నుంచి రూ.100 కోట్లు తీసుకున్నది అనే కదా! కానీ అదే మద్యం వ్యాపారి ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఇచ్చాడు! బీజేపీ వైట్ మనీ తీసుకుంది, వాళ్లు బ్లాక్ మనీ తీసుకున్నారు... అందులో ఏముంది తేడా? 

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఏ పార్టీకి ఎవరు ఎంత ఇస్తున్నారనేది ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.22,500 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు రూపేణా కొనుగోలు చేస్తే... అందులో గత నాలుగేళ్లలో బీజేపీకి వెళ్లింది రూ.6,780 కోట్లు. 

ఇటీవల రామమందిరం పూర్తవగానే, బీజేపీ గతంలో లేని విధంగా మరో విధంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అవినీతికి పాల్పడే వారిని వదిలిపెట్టబోమని, కచ్చితంగా జైలుకు పంపుతామని మోదీ బాహాటంగా మాట్లాడుతున్నారు" అంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy
Arvind Kejriwal
Delhi Liquor Scam
Congress
AAP
Narendra Modi
BJP
Delhi
Telangana

More Telugu News