BJP: సీఏఏ నుంచి ఒలింపిక్స్ బిడ్డింగ్ వరకు... బీజేపీ మేనిఫెస్టో లోతెంతో చూడండి!
- సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
- యువత, మహిళలు, పేదలు, రైతులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోకు రూపకల్పన
- దూరదృష్టితో పలు హామీలకు రూపకల్పన
ఎన్డీయే కూటమిని నడిపిస్తున్న బీజేపీ ఇవాళ తన ఎన్నికల మేనిఫెస్టో 'సంకల్ప పత్ర'ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇందులోని కీలక అంశాలను వివరించారు. ప్రధానంగా దేశానికి మూలస్తంభాలు అనదగ్గ నాలుగు వర్గాలు యువత, మహిళలు, పేదలు, రైతులను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.
14 ముఖ్యమైన హామీలతో కూడిన బీజేపీ మేనిఫెస్టో నిశితంగా పరిశీలిస్తే... దూరదృష్టితో అనేక హామీలను పొందుపరిచినట్టు అర్థమవుతుంది. సీఏఏ, ఒక దేశం ఒకే ఎన్నిక, జాతీయ విద్యా విధానం, ఒలింపిక్ ఎన్నికల బిడ్డింగ్ వంటి అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు.
బీజేపీ సంకల్ప పత్రలో ఉన్న కీలక అంశాలు...
- చైనా, పాకిస్థాన్, మయన్మార్ సరిహద్దుల పొడవునా మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సరిహద్దు కంచెల అభివృద్ధి.
- కేవలం ఒక్క దశాబ్ద కాలంలో భారత్ 11 నుంచి 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇప్పుడు భారత్ ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే బీజేపీ లక్ష్యం.
- 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు భారత్ చేజిక్కించుకునేందుకు ప్రణాళిక బద్ధ కృషి.
- సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అమలుకు బీజేపీ కట్టుబడి ఉంది.
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.
- ఒకే దేశం ఒకే ఎన్నిక మా నినాదం... ఇప్పటికే దీని సాధ్యాసాధ్యాలపై కమిటీ వేశాం. కమిటీ సిఫారసులు వచ్చాక కార్యాచరణ ఉంటుంది.
- దేశంలో ఉన్నతస్థాయి విద్యాప్రమాణాలకు వేదికలుగా ఉన్న ఐఐటీ, ఐఐఎం, ఏఐఐఎంఎస్ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థలను మరింత బలోపేతం చేస్తాం. వాటికి నిధుల కేటాయింపు, సామర్థ్యం పెంపు, మౌలికసదుపాయాల వృద్ధి, పరిశోధనలకు ప్రత్యేక నిధులు అందిస్తాం.
- పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్.
- పేద కుటుంబాలకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత విద్యుత్ అందిస్తాం.
- పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల సమీపంలో మహిళల కోసం హాస్టళ్ల నిర్మాణం... మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత.
- పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు తదితర చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడం కోసం నారీ శక్తి వందన్ అభియాన్ పథకం.
- నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి దేశంలోని అందరు వృద్ధులు.
- రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అందించే రూ.6000 ఆర్థికసాయం కొనసాగింపు.