IPL 2024: 'మా యువ వికెట్ కీప‌ర్ బ్యాటింగ్ అద్భుతం'.. ధోనీపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ కామెంట్‌.. నెట్టింట‌ వీడియో వైర‌ల్‌!

Ruturaj Gaikwad Calls MS Dhoni Young Wicketkeeper During Post Match Presentation Video Goes Viral
  • వాంఖ‌డే స్టేడియంలో ముంబై వ‌ర్సెస్ చెన్నై మ్యాచ్‌
  • చెన్నై ఇన్నింగ్స్‌ ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఎంఎస్‌ ధోనీ ఊచ‌కోత‌
  • 4 బంతుల్లోనే 3 సిక్స‌ర్ల‌తో 20 ప‌రుగులు చేసిన మాజీ కెప్టెన్‌
  • ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌పై కెప్టెన్ రుతురాజ్ ప్ర‌శంస‌లు
వాంఖ‌డే స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచులో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. చివ‌రివ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచులో ముంబైను చెన్నై 20 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచులో మ‌హేంద్ర సింగ్ ధోనీ చెన్నై ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగి ఊచ‌కోత కోశాడు. 

కేవ‌లం నాలుగు బంతులే ఎదుర్కొన్న ధోనీ ఏకంగా 500 స్ట్రయిక్‌ రేట్‌తో 20 ప‌రుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం. మ్యాచ్ విజ‌యంలో చివ‌రికి సీఎస్‌కే జ‌ట్టుకు ఈ ప‌రుగులే కీల‌కం అయ్యాయి కూడా. ఛేద‌న‌లో హిట్‌మ్యాన్ శ‌త‌కం చేసిన‌ప్ప‌టికీ ముంబై 20 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. 

కాగా, మ్యాచ్ ముగిసిన త‌ర్వాత చెన్నై సార‌ధి రుతురాజ్ గైక్వాడ్‌కు ధోనీ ఇన్నింగ్స్‌పై ప్ర‌శ్న ఎదురైంది. ముంబైపై గెల‌వ‌డంలో ఎంఎస్‌డీ పాత్ర గురించి మీ అభిప్రాయం ఏమిట‌ని అడ‌గగా.. "మా యువ వికెట్ కీప‌ర్ బ్యాటింగ్ అద్భుతం. మూడు సిక్స‌ర్లు బాదాడు. ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఆయ‌న చేసిన ప‌రుగులు మాకు బాగా క‌లిసొచ్చాయి. నిజం చెప్పాలంటే ఇరుజ‌ట్ల మ‌ధ్య ఆ ప‌రుగులే కీల‌కం. దాంతో మేము విజ‌యం సాధించాం" అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. ధోనీపై చెన్నై కెప్టెన్ ప్ర‌శంస‌లు కురిపించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.
IPL 2024
Ruturaj Gaikwad
MS Dhoni
Sports News
Cricket

More Telugu News