Viral Video: షార్ట్‌లో బ్యాంక్‌కు వెళ్లిన కస్టమర్.. ఎంట్రీకి నిరాకరించిన సెక్యూరిటీ గార్డు.. వైరల్ వీడియో!
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' బ్రాంచీలో ఘటన
- తానేమీ అర్ధనగ్నంగా బ్యాంకుకు రాలేదని, దుస్తులతోనే వచ్చానని కస్టమర్ వాదన
- కస్టమర్‌ను బ్యాంక్ లోపలికి వదిలిపెట్టేందుకు సెక్యూరిటీ గార్డు ససేమీరా
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన తాలూకు వీడియో
ఇటీవల మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' బ్రాంచీలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ కస్టమర్ షార్ట్ వేసుకుని బ్యాంకు వెళ్లాడు. దాంతో సెక్యూరిటీ గార్డు ఆ కస్టమర్‌ను బ్యాంకులోకి ప్రవేశించకుండా గేటు వద్ద నిలిపివేయడం జరిగింది.
దాంతో.. కస్టమర్ ఆ సెక్యూరిటీ గార్డుతో వాదనకు దిగాడు. తనను ఎందుకు బ్యాంకులోకి వెళ్లకుండా ఆపుతున్నారంటూ ప్రశ్నించాడు. అలాంటప్పుడు బ్యాంక్‌కు వచ్చేవారు షార్ట్ వేసుకుని రావొద్దని, ప్యాంట్లతోనే రావాలని బయట బోర్డు పెట్టాల్సిందని నిలదీశాడు. తానేమీ అర్ధనగ్నంగా బ్యాంకుకు రాలేదని, దుస్తులు వేసుకుని వచ్చానని లోపలికి వదిలిపెట్టాల్సిందిగా వాదించాడు. ఇలా సెక్యూరిటీ గార్డుతో ఘర్షణను ఆ కస్టమర్ వీడియో కూడా తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.