Stock Market: తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 929 పాయింట్లు పతనం
- 216 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ
- మార్కెట్లో అస్థిర పరిస్థితులపై ఇన్వెస్టర్ల ఆందోళన
- ప్రతికూల ప్రభావం చూపిన ఇతర కారణాలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 929.74 పాయింట్లు పతనమై 73,315.16 వద్ద ఆరంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది. 216.9 పాయింట్లు దిగజారి 22,302.50 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీ స్టాక్స్ గణనీయ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతతో మిడిల్ ఈస్ట్‌లో అలముకున్న యుద్ధ మేఘాలు, మార్కెట్లో అస్థిర పరిస్థితుల పట్ల ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారని, సెంటిమెంట్ ప్రతికూలంగా మారిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పెరిగిన ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ద్రవ్యలోటుపై ఆందోళనలు, ఇటీవల ప్రకటించిన విధానపరమైన నిర్ణయాల ప్రభావం కూడా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.