Devyani Khobrogade: నృత్యదేవత డ్రెస్లో భారత రాయబారి ఫొటో షూట్!
- కాంబోడియా పురాణాల్లో నృత్య, ప్రేమాధిదేవతగా ఖ్మర్ అప్సర
- ఖ్మర్ అప్సర దుస్తుల్లో భారత రాయబారి దేవయానీ ఖోబ్రోగడే ఫొటో షూట్
- దేవత వేషధారణలోనే కాంబోడియా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
కాంబోడియాలో భారత రాయబారి దేవయానీ ఖోబ్రోగడే స్థానిక సంప్రదాయక దుస్తుల్లో అక్కడి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి పురాణాల్లో నృత్య, ప్రేమాధిదేవత అయిన ఖ్మర్ అప్సర దుస్తుల్లో ఆమె ఫొటో షూట్ నిర్వహించారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్గా మారాయి. రాయబారి దేవయానీ ఖోబ్రోగడేకు ఖ్మర్ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో గౌరవమని అక్కడి భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. కాంబోడియా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.
1999లో ఖోబ్రోగడే ఐండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం బెర్లిన్, న్యూయార్క్, ఇస్లామాబాద్, రోమ్ వంటి విభిన్న దేశాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 2013లో భారత్, అమెరికా మధ్య దౌత్య వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. ఖోబ్రోగడే వీసా మోసాలు, తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆమెను అరెస్టు చేశారు. మరో ఉదంతంలో భోబ్రోగడే ఆమె తన ఇంట్లోని సహాయకురాలికి అమెరికా చట్టాల ప్రకారం కనీస జీతభత్యాలు చెల్లించలేదన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలను దేవయాని తోసిపుచ్చారు. అయితే, దౌత్యవేత్తలకు ఉన్న రక్షణల కారణంగా అమెరికా కోర్టు ఈ కేసులను కొట్టేసింది.
ఈ వివాదాలు అమెరికా, భారత్ మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఖోబ్రోగడే దౌత్య రక్షణను ఉపసంహరించుకోవాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్ తోసిపుచ్చింది. ఈ క్రమంలో భారత్లో కొందరు అమెరికా దౌత్యవేత్తలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను కేంద్రం ఉపసంహరించుకుంది. ఇందుకు నిరసనగా అమెరికా ఓ దౌత్యవేత్తను కూడా వెనక్కు పిలిపించుకుంది. ఇక ఖోబ్రోగడేను కేంద్ర ప్రభుత్వం 2020లో కాంబోడియాకు భారత రాయబారిగా నియమించింది.