Railway jobs: రైల్వే జాబ్స్.. 4,600 ల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ షురూ
- మే 14 వరకు దరఖాస్తుకు గడువు
- రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో వివిధ ఖాళీల భర్తీ
- పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులు
- ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ
రైల్వేలో భారీ నియామక ప్రక్రియ మొదలైంది.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) లో కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. ఆర్పీఎఫ్ లో మొత్తం ఖాళీలు 4,660 కాగా, వీటిలో కానిస్టేబుల్ పోస్టులు 4,208, ఎస్సై పోస్టులు 452 ఉన్నాయి. వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి రైల్వే శాఖ ఇటీవలే 14 వేల జాబ్ నోటిఫికేషన్స్ ప్రకటించగా.. తాజాగా ఆర్పీఎఫ్ లో ఖాళీల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ రోజు (ఏప్రిల్ 14న) ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ మే 14 తో ముగియనుంది.
అర్హతలు:
కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి; ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత
నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు తప్పనిసరి
వయసు: (2024 జులై 1 నాటికి)
కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు
ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య (రిజర్వేషన్ ప్రకారం సడలింపు వర్తిస్తుంది)
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష (ఆన్‌లైన్)
ఫిజికల్ ఎఫిషియెన్సీ
ఫిజికల్ మెజర్‌మెంట్
దరఖాస్తు రుసుం:
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళలు/ ట్రాన్స్‌జెండర్/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250.
జనరల్ అభ్యర్థులకు రూ.500 (పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ.400 రిఫండ్)
ప్రారంభ వేతనం:
ఎస్సై రూ.35,400
కానిస్టేబుల్ రూ.21,700