Iran Israel war: రక్షణగా నిలిచాం కానీ ప్రతిదాడికి సాయం చేయబోం: బైడెన్
- ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడిపై స్పందించిన అమెరికా
- ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి దాడికి దిగొద్దని సూచన
- నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు
ఇరాన్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ కు రక్షణగా నిలిచామని, డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంలో సాయం చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అయితే, ఇరాన్ పై ప్రతీకార దాడి చేస్తామంటే అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదని ఇజ్రాయెల్ కు బైడెన్ తేల్చిచెప్పారు. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం వాటిల్లలేదని గుర్తుచేస్తూ.. ప్రతీకారం అనే అలోచనే అనవసరమని స్పష్టం చేశారు. ఈమేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన బైడెన్.. ఇదే విషయాన్ని నెతన్యాహుకు చెప్పినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. ఇరాన్ దాడిని తిప్పికొట్టడమే ఇజ్రాయెల్ కు అతిపెద్ద విజయమని, దాదాపు 300 లకు పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినా చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లలేదని గుర్తుచేశారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరుదేశాలు ప్రయత్నించాలని, సంయమనం పాటించాలని బైడెన్ కోరారు.
సిరియా రాజధాని డమాస్కస్ లో తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి దిగడంతో ఇరాన్ ప్రతిదాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా సాయంతో ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్.. తాజాగా తాము కూడా ప్రతీకార దాడి చేస్తామని ప్రకటించింది. సరైన సమయంలో ఇరాన్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. దీనిపై అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి, జీ 7 దేశాలు, భారత్ సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు పెరిగి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని, సంయమనం పాటించాలని ఇరు దేశాలను కోరాయి.