K Kavitha: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను... బెయిల్ ఇవ్వండి: సీబీఐ కేసులో కవిత పిటిషన్
- కవిత తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు
- లోక్ సభ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ అయినందున ప్రచారం నిర్వహించాల్సి ఉందని వెల్లడి
- సీబీఐకి నోటీసులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే సీబీఐ తనను అరెస్ట్ చేసిన కేసులో ఆమె రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరఫున ఆమె న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు.
కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు... సీబీఐకి నోటీసులు ఇచ్చింది. 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని... తాను బీఆర్ఎస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ను అని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్లో కోరారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు.