Rahul Gandhi: ఆ వ్యవస్థలు ప్రధాని మోదీ ఆస్తి కాదు... ప్రతి భారతీయుడివి: కేరళలో రాహుల్ గాంధీ
- రాజ్యాంగ సంస్థలను హస్తగతం చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపణ
- రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వారికి... నాశనం చేయాలనుకునే వారికి మధ్య జరుగుతున్న పోరే ఎన్నికలు అని వ్యాఖ్య
- రాజ్యాంగాన్ని మార్చే అవకాశం కాంగ్రెస్ ఇవ్వదని స్పష్టీకరణ
రాజ్యాంగ వ్యవస్థలు ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ఆస్తి కాదని, ప్రతి ఒక్క భారతీయుడికి చెందినవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఆయన వయనాడ్ నియోజకవర్గంలోని వెల్లిముందాలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను హస్తగతం చేసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వారికి... రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే వారికి మధ్య జరుగుతున్న పోరే ఈ లోక్ సభ ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.
మనం మాట్లాడే భాష, వర్గం, మతం, రాష్ట్రం అనే అంశాలతో సంబంధం లేకుండా అందరి హక్కులను పరిరక్షించేదే రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగం దృష్టిలో అందరూ ఒక్కటే అన్నారు. మన దేశంలో రాజ్యాంగ సంస్థలను ఒక్కటొక్కటిగా చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ.. ఇలా అన్నింటిని వశం చేసుకోవాలని చూస్తోందన్నారు. ఆరెస్సెస్ తన వ్యక్తులను ఈ వ్యవస్థల్లోకి జొప్పిస్తోందని ధ్వజమెత్తారు. ఈ రాజ్యాంగ సంస్థలు దేశానికి చెందినవని... ఏ ఒక్క సంస్థకు చెందినవి కావని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది బీజేపీ ఎంపీలు అప్పుడప్పుడు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ ఎప్పటికీ వారికి అవకాశమివ్వదని స్పష్టం చేశారు. సమాజం, మతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడిని రక్షించడమే కాంగ్రెస్ కర్తవ్యమన్నారు. కాగా కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది.