Israel: మునుపెన్నడూ వాడని ఆయుధాలు కూడా వాడతాం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక

if Israel strikes back We deploy weapons never used before says Iran
  • ఇజ్రాయెల్ ప్రతిదాడి దాడి చేస్తే సెకన్ల వ్యవధిలోనే స్పందిస్తామన్న ఇరాన్
  • ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్న సీనియర్ అధికారి
  • కీలక ప్రకటన విడుదల చేసిన ఇరాన్ సీనియర్ అధికారి
దాడికి ప్రతిదాడి ఉంటుందని, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి దాడి జరిగినా సెకన్ల వ్యవధిలోనే ప్రతిస్పందిస్తామని, అవసరమైతే ఇదివరకెప్పుడూ ఉపయోగించని ఆయుధాలను కూడా మోహరిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి అబోల్ఫజల్ అమౌ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాలను రూపొందించుకున్నామని, ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేసినా గతంలో వాడని ఆయుధాలను కూడా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇరాన్ రాజకీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి అలీ బఘేరి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుందని, కొన్ని సెకన్లలోనే స్పందన ఉంటుందని హెచ్చరించారు. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం మాట్లాడుతూ.. ఇరాన్ దాడి నేపథ్యంలో తదుపరి చర్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 13 ఇరాన్ చేసిన దాడికి ప్రతిస్పందన ఉంటుందన్నారు.

మరోవైపు ఇరాన్ దాడికి ప్రతిస్పందన చర్యపై నిర్ణయం తీసుకోవాలంటూ ‘వార్ కేబినెట్’కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి  బెంజమిన్ నెతన్యాహు సోమవారం 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు సమన్లు పంపించారు. అయితే కేబినెట్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్ని ఆప్షన్లపై చర్చిస్తున్నారని సమాచారం.
Israel
Iran
Israel - Iran Conflict

More Telugu News