X Corp: కొత్త యూజర్లకు ఛార్జీలు.. ‘ఎక్స్’ ఉచిత వినియోగానికి గుడ్‌బై !
- త్వరలోనే అమల్లోకి రానున్న కొత్త విధానం
- తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో పరిశీలన
- ప్రకటించిన ‘ఎక్స్’ అధిపతి ఎలాన్ మస్క్
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ ఉచిత వినియోగ విధానం నుంచి నిష్క్రమించే దిశగా క్రమక్రమంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే నూతన యూజర్లకు ఛార్జీలు విధించనున్నట్టు ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఎంపిక చేసిన దేశాల్లో తక్కువ స్థాయి ఛార్జీలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. లైక్స్, పోస్ట్, రిప్లైలు, ట్వీట్‌లను బుక్‌మార్క్ చేసుకోవడం వంటి కార్యకలాపాలపై రుసులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ విధానాన్ని ఎక్స్ పరిశీలించనుంది. ఈ రెండు దేశాల్లో 1 డాలర్ ఛార్జీని విధించనున్నట్టు తెలుస్తోంది. స్పామ్ అకౌంట్లకు పరిష్కారంతో పాటు ఎక్స్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఎక్స్ ఈ దిశగా అడుగులు వేస్తోంది.
కాగా ఫీజు విధింపును ఎలాన్ మస్క్ సమర్థించారు. ఇబ్బందులు కలగజేస్తున్న స్పామ్ బాట్‌లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ ఖాతాలు, ఆటోమేటెడ్ బాట్‌లను అరికట్టడమే లక్ష్యంగా కొత్త యూజర్లకు రైటింగ్ యాక్సెస్ ఇచ్చేందుకు నామమాత్రపు రుసుము తప్పనిసరి చేస్తున్నామని మస్క్ అన్నారు. కాగా ఛార్జీలు విధిస్తే స్పామ్ కార్యకలాపాలు ఎలా పరిష్కృతమవుతాయని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నకిలీ ఖాతాలు, ఆటోమేటెడ్ బాట్‌లను ఎక్స్ ఎలా నిరోధించగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.