GST ON Selfie: సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ వేస్తారేమో: స్టాలిన్ ట్వీట్
- కేంద్రం పన్నుల విధానంపై మండిపడ్డ తమిళనాడు సీఎం
- కార్పొరేట్ పెద్దలపై కరుణ.. పేదల నుంచి దోపిడీ
- ఈ దోపిడీని అరికట్టాలంటే ఇండియా కూటమికి ఓటేయాలని పిలుపు
హోటల్ లో భోజనం నుంచి టూవీలర్ రిపేర్ల దాకా అన్నింట్లో పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం పేద, మద్యతరగతి ప్రజలను దోచుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. జీఎస్టీ పేరుతో పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ స్టాలిన్ కొత్త భాష్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ వేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ లను మాఫీ చేస్తూ కుబేరులకు అండగా నిలిచే బీజేపీ.. పేదలను మాత్రం నిలువునా దోచేస్తోందని విమర్శించారు.
పేదలంటే బీజేపీకి ఎందుకంత ద్వేషమని, పేద మధ్య తరగతి వారిపై కరుణ చూపలేదా అని ప్రశ్నించారు. కార్పొరేట్ పెద్దలకు సంబంధించిన 1.45 లక్షల కోట్ల పన్ను బీజేపీ మాఫీ చేసిందని స్టాలిన్ చెప్పారు. మొత్తం జీఎస్టీలో ఏకంగా 64 శాతం అట్టడుగు వర్గాల నుంచి, 33 శాతం మధ్యతరగతి ప్రజల నుంచి సమకూరుతుండగా.. సంపన్నులు చెల్లించే జీఎస్టీ ద్వారా కేంద్రానికి సమకూరే మొత్తం కేవలం 3 శాతమేనని స్టాలిన్ వివరించారు. పేదలను దోపిడీ చేసే ఈ వ్యవస్థను మార్చాలంటే ఇండియా కూటమికి ఓటేయాలంటూ తమిళనాడు ప్రజలకు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.