Revanth Reddy: తప్పు రేవంత్ రెడ్డిది కాదు, మనదే... ఆయన చెప్పి మరీ మోసం చేశారు: కేటీఆర్
- ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారని రేవంత్ రెడ్డి గతంలోనే నిజాయతీగా చెప్పారని వ్యాఖ్య
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచిందన్న కేటీఆర్
- లంకె బిందెల కోసం తిరిగేవాళ్లు పచ్చి దొంగలు అయి ఉంటారన్న బీఆర్ఎస్ నేత
- బీజేపీకి బీ టీమ్ అని బేవకూఫ్ గాళ్లు అంటున్నారని ఆగ్రహం
ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నిజాయతీగా చెప్పి మరీ మోసం చేశారని... తప్పు ఆయనది కాదని... మనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వ్యక్తా? కాంగ్రెస్ వ్యక్తా? చెప్పాలని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇక్కడ నాలుగు నెలల క్రితమే కేసీఆర్ ఆత్రం సక్కును అభ్యర్థిగా ప్రకటించారన్నారు. మనకు అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుక్కున్నారని... కానీ ఆత్రం సక్కు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. మంత్రి పదవులు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్రం సక్కు కష్టకాలంలోనూ పార్టీతో ఉన్నారని ప్రశంసించారు.
కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, రూ.4వేల పెన్షన్ అని డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని మండిపడ్డారు. తొలుత డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పంద్రాగస్టులోపు చేస్తామని మాట మార్చారని విమర్శించారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి దానిని విస్మరించారన్నారు. ఎన్నికల్లో రైతులు కర్రు కాల్చి వాత పెడతారనే భయంతో కొత్త వాయిదాను ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ కావాలన్నా... మహిళలకు రూ.2500 రావాలన్నా, వృద్ధులకు రూ.4వేల పెన్షన్ రావాలన్నా.. బీఆర్ఎస్ గెలవాల్సిందే అన్నారు. లేదంటే ఈ పథకాలకు చెల్లుచీటి పాడుతారన్నారు. రైతులు అడగకుండానే తమ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు మేం రైతుబంధు గురించి అడిగితే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. రైతులు చెప్పుతో కొట్టినట్లు కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
లంకె బిందెల కోసం తిరిగేవాళ్లు పచ్చి దొంగలు అయి ఉంటారు
లంకె బిందెలు ఉంటాయని భావించామని రేవంత్ రెడ్డి అంటారని... లంకె బిందెల కోసం తిరిగేటోళ్లు పచ్చి దొంగలు అయి ఉంటారని చురక అంటించారు. కాంగ్రెస్ రాగానే కరవు వచ్చిందన్నారు. మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తోందన్నారు. మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. మన మీద జరిగిన విషప్రచారాన్ని కూడా తిప్పికొట్టలేకపోయామని... అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ఈ లోక్ సభ ఎన్నికలు మన అందరి భవిష్యత్తు... పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మీద ప్రజలు చాలా మంట మీద ఉన్నారని పేర్కొన్నారు. కష్టపడి పని చేస్తే ఆదిలాబాద్ లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న మోసాలను మనం ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ రాలేదని, ఉద్యోగాలు రాలేదన్నారు. కానీ మంది పిల్లలను మా పిల్లలని చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలేమో ఆకాశంలో... చేతలేమో పాతాళంలో అని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవడంతో మనకు దూరమయ్యారన్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో వేతనాలు కాస్త ఆలస్యమైనట్లు చెప్పారు. కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేశారని, ఆరు శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. నాడు ఇంద్రవెల్లిలో కాల్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేకుండా ఇంద్రవెల్లికి వచ్చి గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేసిందన్నారు.
బీజేపీకి బీ టీమ్ అని బేవకూఫ్ గాళ్లు అంటున్నారు
కొంతమంది బేవకూఫ్ గాళ్లు బీఆర్ఎస్ను బీజేపీకి బీ టీమ్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ వంటి వారిని ఓడించింది బీఆర్ఎస్ అభ్యర్థులేనని గుర్తుంచుకోవాలన్నారు. మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీలు అంటున్నారని... కాబట్టి అందరూ ఆలోచించాలని కోరారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిందన్నారు. అసలు తెలంగాణకు ఏమీ ఇవ్వను అనే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు.
బీజేపీ వాళ్లు ఏమైనా అంటే జైశ్రీరామ్ అంటారని... కానీ రాముడు దేవుడని... ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్నారు. రాముడితో మనకు ఎలాంటి పంచాయతీ లేదని... కానీ తెలంగాణకు పైసా ఇవ్వని బీజేపీని పండబెట్టి తొక్కుదామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఎప్పుడూ మోదీని దేవుడు అంటారని... కానీ ఆయన దేవుడు ఎందుకో చెప్పాలన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని బీజేపీ నెరవేర్చలేదన్నారు.