Siddharth Ramkumar: ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాసి.. ఆలిండియా 4వ ర్యాంకుతో కుటుంబానికి సర్‌ప్రైజ్!

A surprise gift from fourth rank holder in Civil Services exam to his family members

  • కేరళకు చెందిన సిద్ధార్థ రామ్‌కుమార్‌కు సివిల్స్‌లో ఆలిండియా 4వ ర్యాంకు
  • తమ కుమారుడు సివిల్స్ రాస్తున్నాడని తెలియని తల్లిదండ్రులకు ఊహించని సర్‌ప్రైజ్
  • టీవీల్లో చూసి తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బైపోయిన వైనం
  • గతేడాదే ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న సిద్ధార్థ

ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాసి ఏకంగా 4వ ర్యాంకు సాధించిన ఓ అభ్యర్థి తన కుటుంబసభ్యులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ కుమారుడు సివిల్స్ ర్యాంకు సాధించాడన్న విషయం టీవీలో చూసి తెలుసుకున్న తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బైపోయారు. 

కేరళకు చెందిన సిద్దార్థ రామ్‌కుమార్ గతేడాది సివిల్స్‌లో 121వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌కు ఎంపికైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే, ఎలాగైనా ఐఏఎస్‌కు ఎంపికవ్వాలన్న పట్టుదలతో ఉన్న సిద్ధార్థ మరోసారి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఈసారి ఫలితాల్లో ఏకంగా 4వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. తాను మరోసారి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న విషయాన్ని మాత్రం కుటుంబసభ్యులకు చెప్పలేదు. దీంతో, సిద్ధార్థ్‌కు 4వ ర్యాంకు వచ్చిన విషయం టీవీలో చూసి తెలుసుకున్న తల్లిదండ్రులు, సోదరుడు సర్‌ప్రైజ్ అయ్యారు.  

సిద్ధార్థ తండ్రి రామ్‌కుమార్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశారు. ఆయన తల్లి గృహిణి. సిద్ధార్థ సోదరుడు ఆదర్శ్ హైకోర్టులో లాయర్‌గా చేస్తున్నారు. సిద్ధార్థకు ఏకంగా 4వ ర్యాంకు రావడంపై ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ‘‘అతడు మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నట్టు మాకు అసలు తెలియనే తెలియదు. తన ర్యాంకు మెరుగుపరచుకునేందుకు మళ్లీ పరీక్ష రాస్తున్నట్టు మాకు చెప్పలేదు’’ అని ఆదర్శ్ మీడియాతో వ్యాఖ్యానించారు. 

సిద్ధార్థ చిన్నప్పటి నుంచీ చదువులోనే కాకుండా ఆటల్లోనూ చురుకుగా ఉండేవాడని ఆయన తల్లి చెప్పారు. స్కూలు క్రికెట్ టీంకు కెప్టెన్‌గా ఉండేవాడని పేర్కొన్నారు. ఐఏఎస్ కావాలన్నది అతడి కల అని వివరించారు. 

ఈసారి సివిల్స్‌ సర్వీసులకు చెందిన అనేక మంది కేరళవారు ఎంపికయ్యారు. ఈసారి పరీక్షల్లో దేశవ్యాప్తంగా మొత్తం 1,016 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. 

  • Loading...

More Telugu News