Bonda Uma: సీఎంపై రాయి దాడి ఘటనతో నాకు సంబంధం లేదు: బోండా ఉమ స్పష్టీకరణ
- ఈ నెల 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి
- బోండా ఉమపై ఆరోపణలు
- సానుభూతి కోసం గులకరాయి డ్రామా ఆడుతున్నారన్న ఉమ
- సానుభూతి రాకపోవడంతో టీడీపీ నేతల మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
- ఈ విషయం గవర్నర్ దృష్టికి తీసుకెళతానని వెల్లడి
విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి వ్యవహారంలో తన చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ఎన్నికల ముందు సానుభూతి కోసం గులకరాయి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. వారు ఆశించిన సానుభూతి లభించకపోవడంతో, ఈ వ్యవహారాన్ని టీడీపీ నేతల మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉమా మండిపడ్డారు.
వేముల దుర్గారావును తమ కార్యాలయంలో ఉండగా పట్టుకెళ్లారని, వేముల దుర్గారావు తమ పార్టీ ఆఫీసు వ్యవహారాలు చూస్తుంటాడని వివరించారు. అన్యాయంగా ఇరికిస్తే జూన్ 4 తర్వాత ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామని బోండా ఉమ వెల్లడించారు.
"సీఎంపై రాయి దాడితో నాకు సంబంధం లేదు. కానీ కొందరు అధికారులు నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. సీబీఐ విచారణ జరిపించండి... నేను విచారణకు సహకరిస్తా. వేముల దుర్గారావును హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారు. అంతకుముందు వడ్డెరగూడెం పిల్లలను తీసుకెళ్లి హింసించారు. తనకు డబ్బు ఇవ్వకపోవడంతో రాయి విసిరినట్టు అందులో ఒకరు చెప్పారు" అని బోండా ఉమ వివరించారు.