Pawan Kalyan: నేను భీమవరం నుంచి వెళ్లిపోవడంతో జగన్ చాలా బాధపడిపోతున్నారు: పవన్ కల్యాణ్ వ్యంగ్యం
- పెడనలో ప్రజాగళం సభ
- హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- నీ ఎమ్మెల్యేలను ఎందుకు బదిలీ చేశావు జగన్ అంటూ పవన్ ఫైర్
- నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అంటూ వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు. బందరు పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారని, పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
"నిన్న జగన్ భీమవరంలో మాట్లాడుతూ చాలా బాధపడ్డారు. నేను భీమవరం నుంచి పిఠాపురం వెళ్లిపోవడం ఆయనకు బాధ కలిగించింది! ఇప్పుడు నేను జగన్ ను అడుగుతున్నా... మీ ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు ఎందుకు పంపించేశావు? 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు.
జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అంటున్నాడు. డబ్బున్న వాళ్లు పేదలను దోచుకోవడమే క్లాస్ వార్. ఈ ఐదేళ్లలో జగన్ పేదలను దోచుకున్నాడా, లేక మేం పేదలను దోచుకున్నామా? జగన్ వచ్చీ రావడంతోనే రూ.337 కోట్ల మేర ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొట్టాడు. వారానికి ఒక రోజు సెలవు ఇస్తానని చెప్పి పోలీసుల శ్రమను దోపిడీ చేస్తున్న వ్యక్తి ఈ జగన్. ఇతడు క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు! మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు జీవో.217 తీసుకువచ్చారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను కూడా దారి మళ్లించారు.
స్థానిక ఎమ్మెల్యే గురించి జనవాణిలో నాకు ఒకటే చెప్పారు. కొత్త పాస్ బుక్కు కావాలంటే రూ.10 వేలు ఇవ్వాలంట... చేపల చెరువు తవ్వుకోవాలంటే రూ.1.50 లక్షలు లంచం ఇవ్వాలంట... చేపల దాణా షాపు పెట్టాలంటే రెండు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి... మోటారు కూడా ఆయన చెప్పిన షాపులోనే కొనాలంట.
పెడన ఎమ్మెల్యే ఇక్కడ డ్రైనేజి ఏర్పాటు చేయలేకపోయాడు కానీ, తన నోటినే డ్రైనేజిగా వాడుకునే వ్యక్తి డ్రైనేజిని ఏం ఏర్పాటు చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాళ్లు పదవులకెక్కారు. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లినా నమస్కారాలు పెట్టాలంట. నమస్కారాలు పెట్టకపోతే జనసైనికులపై గంజాయి కేసులు పెట్టాడు. మట్టి మాఫియాపై ఫిర్యాదు చేసిన యువతను చెట్టుకు కట్టేసి కొట్టాడీ వ్యక్తి!
నా ఆస్తిని అతడి అనుచరులు దోచేసుకుంటున్నారని చనిపోయిన ఒక జడ్జి తల్లి జనవాణిలో నా వద్దకు వస్తే చాలా బాధేసింది. ఈ రాష్ట్రంలో జడ్జి కుటుంబాలను కూడా వేధిస్తున్నారు" అంటూ పవన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.