Chandrababu: నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్... నీ సభలకు నేను కరెంట్ ఇస్తా: చంద్రబాబు
- మచిలీపట్నంలో వారాహి విజయభేరి సభ
- హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు
- ఇక్కడొక నీతుల నాని ఉన్నాడంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు
టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. కృష్ణా జిల్లా సాహిత్య, సాంస్కృతిక రంగాలకు వేదిక అని అభివర్ణించారు. తాము ప్రజల కోసమే కూటమి కట్టామని అన్నారు. తమ కలయిక స్వార్థం కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
గతంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానీలు ఈ జిల్లాకు చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఒకడు బూతుల నాని, మరొకడు నీతుల నాని అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉండే నీతుల నాని... మాట్లాడితే రెండు చెప్పులు తీసుకుని కథలు కథలుగా చూపిస్తుంటాడని అన్నారు. నీతుల నానీ... నీకు పదవి ఇచ్చింది పవన్ కల్యాణ్ ను, నన్ను తిట్టడానికా? అని ప్రశ్నించారు.
నీతుల నానీ... బందరులో ఏం అభివృద్ధి చేశారో చెప్పే దమ్ము నీకు ఉందా? అని ప్రశ్నించారు. ఈ సైకో జగన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సైకోను తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ... మేం బుల్లెట్లకే భయపడలేదు ఈ సైకోలకు భయపడతామా? అంటూ వ్యాఖ్యానించారు.
బందరు బైపాస్ రోడ్డులో నితీశ్ అనే వ్యక్తి రూ.150 కోట్లతో మాల్ కడుతుంటే ఎన్ఓసీ ఇవ్వకుండా ఈ నీతుల నాని అడ్డుపడ్డాడని చంద్రబాబు ఆరోపించారు.
"వైసీపీకి ఓటేస్తే ఏం చేస్తారు? అవినాశ్ రెడ్డిని అరెస్ట్ నుంచి తప్పించేందుకు ఆ అధికారాన్ని ఉపయోగిస్తారు. జగన్ మోహన్ రెడ్డీ... బాబాయ్ పై గొడ్డలి వేటు ఎవరేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటు అడుగు... చెప్పే ధైర్యం నీకు ఉందా? ఆయన కన్న కూతురు, నీ చెల్లెలు మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది.
ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి పోటు అంశాన్ని మాపై వేశారు... ఆ తర్వాత కోడికత్తి డ్రామా... నిన్న చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి ఎవడో వేస్తే నేను, పవన్ కల్యాణ్ వచ్చి హత్యాయత్నం చేశామంట. డిపార్ట్ మెంట్ నీది... కరెంట్ పోతే మేం కారణమా? నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్... నువ్వు మీటింగు పెట్టుకో... నీకు కూడా మేం కరెంట్ ఇస్తాం... ఎక్కడా కరెంట్ ఆఫ్ కాదు.
ఒక దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. దళితులకు శిరోముండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు... నిన్ననే అతడు దోషి అని తేలింది. జడ్జిలపై వ్యాఖ్యలు చేసిన ఒక ఎన్నారైని పక్కనబెట్టుకుని తిరుగుతున్నాడు ఈ జగన్" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.