Pawan Kalyan: సోనియా ముందు ఒక చిన్న ప్లకార్డు పట్టుకోలేక మూలన దాక్కున్నావు: సీఎం జగన్ పై పవన్ విమర్శలు
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వారాహి విజయభేరి సభ
- హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు
- జగన్ కు దెబ్బ తగిలితే, రాష్ట్రానికి దెబ్బ తగిలినట్టా అంటూ పవన్ ఫైర్
- జగన్ వంటి వ్యక్తులను రాజకీయాల నుంచి పక్కనబెట్టాలని పిలుపు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇవాళ వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభకు జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ... భారతదేశానికి జాతీయ పతాకం అందించిన పింగళి వెంకయ్య గారిని స్మరించుకుంటున్నానని తెలిపారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రఖ్యాత తత్వవేత్త ఉప్పులూరి గోపాల కృష్ణమూర్తి (యూజీ) మచిలీపట్నంలోనే పుట్టారని వివరించారు. ఆయన పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇక్కడ ఎంతోమంది యువత ఉన్నారని, ఇంతటి ప్రకృతి వనరులున్న ప్రాంతంలో ఉపాధి లేకపోవడం బాధగా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
"ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తుందో చూస్తా అన్నాడు. నీ తాటాకు చప్పుళ్లకు, నీ ఆకురౌడీ మాటలకు భయపడతానా? ఇప్పుడు అతడి కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి అంట. ఆయన కొడుకేమైనా దిగొచ్చాడా? అతడి రక్తం ఏమైనా బ్లూ కలర్ లో ఉంటుందా? అతడు దాడులు చేస్తే భరించాలా?" అంటూ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
"ఇక్కడి ఆకు రౌడి ఎంఎల్ఏ నేను కాపును కాబట్టి మావాడే అని తిడతాడంట, కులం కులం ఒకటైతే నోటికి ఎంతొస్తే అంత మట్లాడుతావా? నువ్వు వెళ్ళి కుక్క పిల్లలా కూర్చుని జగన్ కు ఊడిగం చేసుకో, ఎక్కువ మాట్లాడకు, తమాషాగా ఉంది ఒక్కొక్కడికి. మర్యాదగా మాట్లాడితే మర్యాద ఇస్తాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ప్రజాస్వామ్యం మీద గౌరవంతో ఊరుకుంటున్నాను, కసి లేక కాదు" అని హెచ్చరించారు.
పవన్ తన ప్రసంగంలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. "ప్రత్యేక హోదా కోసం ఈ జగన్ కేంద్రం మెడలు వంచుతానని అన్నాడు. అంటే ప్రధాని మోదీ గారి మెడలు వంచుతావా? నువ్వసలు ధైర్యంగా ఆయన ముందు నిల్చొని మాట్లాడగలవా? రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం సోనియా గాంధీ ముందు ఒక చిన్న ప్లకార్డు పట్టుకునే దమ్ము లేక మూలన దాక్కున్నావు" అని ఎద్దేవా చేశారు.
"జగన్ తలకు దెబ్బ తగిలితే అది రాష్ట్రానికి తగిలిన దెబ్బ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇంతమంది యువతకు ఉపాధి లేకపోతే అది రాష్ట్రానికి తగిలిన గాయం కాదా? జగన్ తలకు రాయి ఎలా తగిలిందో, ఆయనే ఏమైనా కొట్టిచ్చుకున్నాడో తెలియదు. కానీ మాపై ఆరోపణలు చేస్తున్నారు. నీ మీద దాడి చేయడానికి మాకేమైనా సరదానా? దాడులు చేయడానికి నీలాగా మేమేమీ క్రిమినల్స్ కాదు. సొంత బాబాయ్ ని నరికించిన వాడిని, నరికేసిన వారిని వెనకేసుకొస్తున్న వ్యక్తివి నువ్వు. అయినా, అందరి మీద దాడి చేసే నీ మీద ఎవరు దాడి చేస్తారు?" అని ధ్వజమెత్తారు.
"జగన్ ను రాజకీయాల నుంచి పక్కనబెట్టాలి. అతడి వంటి వ్యక్తులు రాష్ట్రానికి, దేశానికి పట్టిన చీడ పురుగులు. వై నాట్ 175 అంటున్నాడు జగన్... జగన్ కు 15 చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు.
నిన్న జగన్ భీమవరంలో మాట్లాడుతూ పెళ్ళాం అని అంటున్నాడు. జగన్ అర్ధాంగి భారతి గారి గురించి అనడానికి మాకు ఎంతో సేపు పట్టదు... పెళ్ళాం అని మేము దిగజారి మాట్లాడం. ఈ దిగజారుడు ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నాం -
రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని మూడు పార్టీలం తగ్గి వచ్చాం. జనసేనకు ఓటు శాతం పెరిగినా, బందరులో జనసేనకు పట్టు ఉన్నా... టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను గెలిపించడానికి వచ్చాం.
మీ భవిష్యత్తు కోసం పనిచేసేవారు, ఇక్కడి యువతకు, మత్స్యకారులకు ఉపాధి చూపించేవారు కావాలి. అసెంబ్లీలో బూతులు తిట్టేవారు మీ భవిష్యత్ కోసం ఎందుకు మాట్లాడతారు? ప్రభుత్వ ఓటు చీలకూడదనే పొత్తుతో ముందుకు వచ్చాం" అని పవన్ కల్యాణ్ వివరించారు.
"జగన్ మాట్లాడితే మండదా అంటున్నాడు, రాయి వేసినందుకు మండింది అంట, మీకు రాయి తగిలినందుకు మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెబుతాం విను. పోలవరం రాకుండా చేసావు... మండదా! రాజధాని లేకుండా చేసావు... మండదా! అంబేద్కర్ విదేశీ విద్య ఆపేశావు... మండదా! 15 ఏళ్ల అమర్నాథ్ ను కాల్చి చంపిన వారికి బెయిల్ ఇప్పించావు... మండదా! దళిత డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపించావు... మండదా! దళిత డ్రైవర్ ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే... మండదా! 30 వేల మహిళలు అదృశ్యం అయితే... ప్రజలకు మండదా! అంగన్వాడీ టీచర్లను కాళ్ళతో తొక్కిస్తే... మండదా! ఆశా వర్కర్లను జైల్లో పెట్టిస్తే... మండదా! నిరంకుశపాలన చూస్తే మండదా... అన్ని విధాలుగా మండిపోయి ఉన్నారు జనాలు" అంటూ ధ్వజమెత్తారు.