Harish Rao: ఫోన్ ట్యాపింగ్‌పై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు... రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారని ఆరోపణ!
- ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు తాము సహకరిస్తామన్న హరీశ్ రావు
- వ్యాపార అవసరాల కోసం పార్టీ మారుతున్నారని విమర్శ
- వైఎస్ కూడా తమ పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారన్న హరీశ్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం ఆయన ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో మాట్లాడుతూ... తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా ఉద్దేశపూర్వకంగా చేస్తోందేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని సవాల్ చేశారు. ట్యాపింగ్‌పై స్వతంత్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు తాము సహకరిస్తామన్నారు.
కాంగ్రెస్ ఏ హామీని నెరవేర్చడం లేదని... సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ట్యాపింగ్ పైనా దర్యాఫ్తు జరగాలన్నారు. ట్యాపింగ్ అంశంలో ప్రణీత్ రావు అయినా... ఇంకెవరైనా శిక్ష పడాల్సిందే అన్నారు. కోర్టులో నిర్ధారణ జరిగితేనే నేరం అవుతుందని పేర్కొన్నారు. ట్యాపింగ్ అంటూ ఇప్పుడు జరుగుతోంది అంతా బురద జల్లడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ శాఖకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సమాజంలో సానుభూతి ఎక్కువ అని... అందుకే రెండుసార్లు ఓడిన కాంగ్రెస్ పార్టీని సానుభూతితో గెలిపించారని అభిప్రాయపడ్డారు. మోసపూరిత హామీలు ఇవ్వడం కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమే అన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కేడర్‌ను సన్నద్ధం చేయడంలో లోపం మరో కారణమన్నారు. దళితబంధు విషయంలో ఒకటి రెండుచోట్ల పొరపాట్లు జరిగాయని... దానిని సరిదిద్దేందుకు కేసీఆర్ చూశారన్నారు. కాంగ్రెస్ హయాంలో దాడుల పేరుతో వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు.
కాంగ్రెస్ వచ్చిన ఈ నాలుగు నెలల్లో వృద్ధులకు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిందన్నారు. ప్రభుత్వంతో సరిగ్గా పని చేయించాలని ప్రజలు తమకు ప్రతిపక్ష బాధ్యతను అప్పగించారన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంటూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓ వైపు విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తాను నేరుగా ప్రజలను కలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని... కానీ ఒకరోజు మాత్రమే కలిశారని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. ఇదేనా ప్రజాపాలన అంటే... అని నిలదీశారు.
వ్యాపార అవసరాల కోసం పార్టీ మారుతున్నారు
కొంతమంది తమ వ్యాపార అవసరాల కోసం పార్టీని మారుతున్నారని హరీశ్ రావు అన్నారు. ఇతర పార్టీల నుంచి వస్తే తాము అప్పుడు చట్ట ప్రకారమే చేర్చుకున్నామన్నారు. ఎమ్మెల్యేగా తమ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని కాంగ్రెస్ చేర్పించుకొని లోక్ సభ టిక్కెట్ ఇవ్వడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. పార్టీ మారితే వెంటనే వేటు పడాలని రాహుల్ గాంధీ అంటున్నారని... మేనిఫెస్టోలో కూడా పెట్టారని గుర్తు చేశారు. కానీ రాహుల్ గాంధీ పక్కనే పార్టీ మారిన వ్యక్తి ఉన్నారని... మరి ఆయన మాటలు.. మేనిఫెస్టో తప్పేనా? అని మండిపడ్డారు. సభాపతి తమకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.
వైఎస్ కూడా మా పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారు
బీఆర్ఎస్ ఇన్నేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తమ పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారన్నారు. మున్ముందు బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కుంగిపోవడం సాధారణమేనని... కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు దెబ్బతింటే తాము రాజకీయం చేయలేదన్నారు. వాటికి మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. కానీ మేడిగడ్డ వద్ద కొద్దిగా దెబ్బతింటే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దెబ్బతిన్న కాళేశ్వరానికి వెంటనే మరమ్మతులు చేయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు జరిగితే శిక్షించవచ్చునన్నారు. కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీని ఎలా ఇరికిద్దామా? అని చూస్తున్నారు తప్ప రైతులను ఆదుకోవాలనుకోవడం లేదని విమర్శించారు. రైతులను ఇబ్బందిపెట్టే రాజకీయం వద్దని సూచించారు. తమ ప్రజెంట్ లీడర్... ఫ్యూచర్ లీడర్ కేసీఆరే అన్నారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యకు దిగడం సరికాదన్నారు.