IPL 2024: ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ కళ్లుచెదిరే స్టంపింగ్.. వీడియో వైరల్!
- నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌తో ఢిల్లీ మ్యాచ్
- మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి ఔరా అనిపించిన పంత్
- ఒకే ఓవర్‌లో ఇద్దరిని స్టంపింగ్ చేసిన వైనం
రోడ్డు ప్రమాదం తర్వాత నేరుగా ఈ ఐపీఎల్ సీజన్‌లో పునరాగమనం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బుధవారం గుజరాత్ టైటాన్స్ తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచులో పంత్ అదరగొట్టాడు. బ్యాటర్‌గా ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు నిన్నటి మ్యాచులో వికెట్ కీపింగ్‌లో గొప్ప నైపుణ్యం ప్రదర్శించాడు. రెండు చక్కటి క్యాచులు అందుకోవడంతో పాటు ఒకే ఓవర్‌లో ఇద్దరిని మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం విశేషం. అందులోనూ గుజరాత్ ఆటగాడు అభినవ్ మనోహార్‌ను స్టంపౌట్ చేసిన విధానం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసింది.
అభినవ్ వస్తూ వస్తూనే క్రీజు వదిలి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ, బాల్ బ్యాట్‌కు తాకలేదు. దాంతో వికెట్ల వెనక పంత్ మెరుపు వేగంతో బంతిని అందుకుని మనోహర్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఈ స్టన్నింగ్ స్టంపౌట్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రిషభ్ పంత్ కీపింగ్ నైపుణ్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్నటి మ్యాచులో రెండు క్యాచులు, రెండు స్టంపింగ్‌లతో పాటు 16 పరుగులు చేసిన పంత్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఇక 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకున్న పంత్.. 15 నెలల తర్వాత ఐపీఎల్ ద్వారా తిరిగి బ్యాట్ పట్టాడు. దాంతో అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ ఐపీఎల్‌లో రిషభ్ ఆడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ మునుపటి పంత్‌ను గుర్తు చేస్తున్నాడు. దీంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు తాను రేసులో ఉన్నానని చాటుతున్నాడు.