Sugars in Nestle baby foods: చిన్నారుల ఫుడ్స్‌లో చక్కెర.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!
- పబ్లిక్ ఐ సంస్థ పరిశోధనలో సంచలన విషయాల వెల్లడి
- చిన్నారుల ఫుడ్స్‌కు చక్కెర జత చేయకూడదంటున్న నిబంధనలు
- భారత్‌లోని నెస్లే చిన్నారుల ఉత్పత్తుల్లో చక్కెర అధికంగా ఉందన్న పబ్లిక్ ఐ
- ఐరోపా దేశాల్లో మాత్రం చక్కెర రహిత ఉత్పత్తులనే నెస్లే విక్రయిస్తోందని వెల్లడి
- భారత్‌లో విక్రయించే ఉత్పత్తులలో చక్కెర శాతాన్ని ఏటా తగ్గిస్తున్నామని నెస్లే ప్రకటన
చిన్నారుల ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే భారత్‌లో నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లల ఫుడ్స్‌కు చక్కెరను జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ సంస్థ తన పరిశోధనలో తేల్చింది. బ్రిటన్, జర్మనీ, స్విట్జర్ల్యాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం చక్కెర రహిత ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తేల్చింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే పాలు, సెరెలాక్ ఉత్పత్తుల్లో చక్కెర, తేనె జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ తేల్చింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, చిన్నారులకు ఉద్దేశించిన ఉత్పత్తుల్లో చక్కెర జత చేయకూడదు. ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు. కానీ, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో వంటి పేద దేశాల్లో నెస్లే ఈ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలింది.
ఈ వార్తలపై నెస్లే స్పందిస్తూ, గత ఐదేళ్లల్లో తాము భారత్‌లోని చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని 30 శాతం మేర తగ్గించామని చెప్పుకొచ్చింది. ఈ ఉత్పత్తులను నిత్యం సమీక్షిస్తూ చక్కెర శాతాన్ని తగ్గించేందుకు మార్పులు చేర్పులు చేస్తుంటామని ప్రకటించింది.
పబ్లిక్ ఐ నివేదిక ప్రకారం, నెస్లే భారత్‌లో విక్రయిస్తున్న సెరెలాక్ ఉత్పత్తుల్లో సగటున ఒక్కో సర్వీంగ్‌కు మూడు గ్రాముల చక్కెర ఉంటోంది. థాయిల్యాండ్, ఇథియోపియా ఉత్పత్తులలో చక్కెర స్థాయి సర్వీంగ్‌కు ఆరు గ్రాములుగా ఉంది. చాలా సందర్భాల్లో ఆయా ఉత్పత్తుల్లో చక్కెర స్థాయులను ప్యాకేజింగ్‌పై ముద్రించట్లేదని కూడా పబ్లిక్ ఐ పేర్కొంది. ఇవే ఉత్పత్తుల్ని నెస్లే.. చక్కెర లేకుండా ఐరోపాలో విక్రయిస్తోంది.
చక్కెరతో ప్రమాదం ఇదే!
చక్కెర వ్యసనంగా మారే అవకాశం ఉందని, కాబట్టి చిన్న పిల్లల ఉత్పత్తులకు దీన్ని జత చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ‘‘తీపికి అలవాటు పడ్డ చిన్నారులు, అలాంటి ఫుడ్స్‌వైపే మొగ్గుచూపుతారు. ఫలితంగా చిన్నతనంలో శరీరానికి తగిన పోషకాలు అందక పెద్దాయ్యాక అనారోగ్యాల బారిన పడే అవకాశం పెరుగుతుంది’’ అని బ్రెజిల్‌లోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు.