Imran Khan: నా భార్యకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్ ను వదిలి పెట్టను: ఇమ్రాన్ ఖాన్

I wll not leave army chief if anything happens to my wife warns Imran Khan

  • పాకిస్థాన్ లో ఆటవిక రాజ్యం కొనసాగుతోందన్న ఇమ్రాన్ ఖాన్
  • జనరల్ మునీర్ అక్రమాలను బహిర్గతం చేస్తానని వెల్లడి
  • దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా తయారయిందని ఆవేదన

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య బుష్రా బీబీ అరెస్ట్ కు మునీర్ కారణమని ఆయన అన్నారు. ఇమ్రాన్ భార్య బుష్రా ఒక అవినీతి కేసులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇస్లామాబాద్ శివారులో ఉన్న నివాసంలో ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. 

తన భార్య శిక్ష గురించి ఇమ్రాన్ మాట్లాడుతూ... ఆమెకు శిక్ష విధించిన న్యాయమూర్తే తనతో మాట్లాడారని తెలిపారు. తీర్పు విషయంలో తనపై ఎంతో ఒత్తిడి ఉందని జడ్జి చెప్పారని అన్నారు. తాను బతికున్నంత వరకు ఆసిమ్ మునీర్ ను వదిలి పెట్టబోనని... తన భార్యకు ఏమైనా జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఆటవిక రాజ్యంలో రాజే అన్నీ నిర్ణయిస్తాడని... ఆయన కోరుకుంటే నవాజ్ షరీఫ్ నేరాలను క్షమిస్తాడని... తమకు ఐదు రోజుల్లోనే మూడు కేసుల్లో శిక్షలు విధిస్తాడని మండిపడ్డారు. జనరల్ మునీర్ తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధమైన అక్రమ నిర్ణయాలన్నింటినీ బహిర్గతం చేస్తానని తెలిపారు. 

దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా తయారయిందని ఇమ్రాన్ అన్నారు. ఐఎంఎఫ్ రుణాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడదని ఇమ్రాన్ చెప్పారు. పెట్టుబడుల ద్వారానే దేశంలో ఆర్థిక స్థిరత్వం వస్తుందని అన్నారు. చట్టాలు సక్రమంగా అమలైనప్పుడే దేశంలోకి పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఆటవిక రాజ్యం కొనసాగినంత కాలం అది సాధ్యమయ్యే అవకాశం లేదని అన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై ఆర్మీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News