Google: ‘ఇజ్రాయెల్ కాంట్రాక్టు’పై ధర్నా చేసిన 28 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్
- కంపెనీ పాలసీలను ఉలంఘించినందుకే తొలగించాలమని వెల్లడి
- ఆఫీసుల్లో అలాంటి ప్రవర్తనను ఉపేక్షింబోమని స్పష్టీకరణ
- తమను తొలగించడాన్ని తిరుగుబాటు చర్యగా అభివర్ణించిన ఉద్యోగులు
అమెరికాలోని వివిధ గూగుల్ ఆఫీసుల ఎదుట జరిగిన ధర్నాల్లో పాల్గొన్న 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం విధుల నుంచి తొలగించింది. 1.2 బిలియన్ డాలర్ల విలువైన ‘ప్రాజెక్ట్ నింబస్’ కాంట్రాక్టుకు వ్యతిరేకంగా ఆ ఉద్యోగులు గళం విప్పారు. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఏఐ, క్లౌడ్ సేవలు అందించేందుకు అమెజాన్ తో కలసి గూగుల్ ఈ కాంట్రాక్టు చేపడుతోంది. గూగుల్ కు చెందిన న్యూయార్క్ సిటీ, సియాటిల్, సన్నీవాలే, క్యాలిఫర్నియా ఆఫీసుల బయట ఈ ధర్నాలు జరిగాయి.
9 మంది ఉద్యోగుల అరెస్ట్
న్యూయార్క్, క్యాలిఫోర్నియాలోని గూగుల్ ఆఫీసుల వద్ద దాదాపు 10 గంటలపాటు నిరసనకారులు ధర్నా చేపట్టారు. అయితే ఇందులో పాల్గొన్న 9 మంది ఉద్యోగులను ట్రెస్ పాసింగ్ అభియోగాలపై పోలీసులు అరెస్టు చేశారు. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం ధర్నాలో పాల్గొన్నందుకు తొలుత సెలవుపై ఉంచుతున్నట్లు కంపెనీ ఎంప్లాయీ రిలేషన్స్ గ్రూప్ నుంచి ఉద్యోగులకు మెసేజ్ లు అందాయి. ఈ విషయాన్ని వీలైనంత గోప్యంగా ఉంచుతున్నామని.. అవసరమైనంత మేరకే సమాచారాన్ని బయటపెడుతున్నామని గూగుల్ ఆ ఉద్యోగులకు తెలిపింది. అయితే బుధవారం సాయంత్రం మాత్రం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు వారికి తెలియజేసింది.
గూగుల్ ఏం చెప్పిందంటే..
కంపెనీ పాలసీలను ఉల్లంఘించినందుకు కొందరు ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. ఆఫీసులో అలాంటి ప్రవర్తనకు చోటులేదని.. దాన్ని ఉపేక్షింబోమని అంతర్గత మెమోలో పేర్కొంది. విధులకు ఆటంకం కలిగించే ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తామని.. నిబంధనలను ఉల్లంఘించిన వారిని తొలగించడం సహా కఠిన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ కొనసాగిస్తామని.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే నిరసనల్లో ‘నో టెక్ ఫర్ అపార్తీడ్’ పేరుతో పాల్గొన్న నిరసనకారుల బృందం కంపెనీ చర్యను ఖండించింది. దీన్ని తిరుగుబాటుగా అభివర్ణించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు గూగుల్ ఉద్యోగులకు ఉందని వాదించింది.