Chandrababu: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే

Vote for Note Case hearing adjourned in Supreme Court
  • కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చలేదని ఆర్కే పిటిషన్
  • సెలవుల తర్వాత విచారణ చేపట్టాలన్న టీఎస్ ప్రభుత్వ న్యాయవాది
  • తదుపరి విచారణ జులై 24కి వాయిదా
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు పేరును చార్జ్ షీట్ లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని... అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్ లో ఆళ్ల పేర్కొన్నారు. అయితే, ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ తరపు న్యాయవాది కోరారు. దీంతో, తదుపరి విచారణను ధర్మాసనం జులై 24కి వాయిదా వేసింది. 

ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కయ్యారని అన్నారు. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదా ఇచ్చే అవకాశం ఉండదని కోర్టు చెప్పిందని తెలిపారు. కేసు ముందుకు సాగకుండా ఏడేళ్ల నుంచి రకరకాల కారణాలతో సాగదీస్తున్నారని విమర్శించారు. ఇదే చివరి వాయిదా అని కోర్టు స్పష్టం చేసిందని... రాబోయే రోజుల్లో ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఈ కేసు ముందుకు సాగకపోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేయడమే కారణమని చెప్పారు.
Chandrababu
Telugudesam
Revanth Reddy
Congress
vote for note
Alla Ramakrishna Reddy
YSRCP

More Telugu News