Stone Attack On Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసు: నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- ఈ నెల 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి
- ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- నేడు విజయవాడ కోర్టులో ముగిసిన వాదనలు
ఏపీ సీఎం జగన్ పై ఈ నెల 13న విజయవాడలో రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడ్ని విజయవాడ పోలీసులు నేడు కోర్టులో హాజరుపరిచారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు పేర్కొన్న పుట్టినతేదీ వివరాలకు, అతడి ఆధార్ కార్డులో ఉన్న తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడి ఆధార్ కార్డులోని పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని సదరు న్యాయవాది స్పష్టం చేశారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెట్టారని కోర్టుకు విన్నవించారు. పోలీసులు ఐపీసీ 307 సెక్షన్ తో హత్యాయత్నం కేసు నమోదు చేశారని, 307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని వివరించారు.
పోలీసుల తరఫు న్యాయవాది స్పందిస్తూ... నిందితుడు దురుద్దేశపూర్వకంగానే రాయితో దాడి చేశాడని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి విజయవాడ కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిశాయి.
మరోవైపు, సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పలువురు అనుమానితుల బంధువులు విజయవాడ కోర్టులో సెర్చ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ వారు పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో తమ పిల్లలను ఉంచినట్టు తెలుస్తోందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం సెర్చ్ వారెంట్ జారీ చేసింది. సెర్చ్ వారెంట్ మేరకు అడ్వొకేట్ కమిషనర్ నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. పోలీస్ స్టేషన్ లో అనుమానితులు ఉన్నారో, లేదో పరిశీలించనున్నారు.