YS Viveka Murder Case: వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దు... సునీత, షర్మిల, చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలకు కడప కోర్టు ఆదేశాలు

Kadapa court restrains opposition leaders talking about Viveka murder case
  • ఇటీవల ఎన్నికల ప్రచారంలో వివేకా ప్రస్తావనలు
  • కడప కోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత సురేశ్ బాబు
  • విపక్ష నేతలను ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం చుట్టూ రాజకీయాలు అల్లుకుపోయిన నేపథ్యంలో, నేడు కడప కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు గురించి ఎక్కడా మాట్లాడొద్దంటూ డాక్టర్ సునీత, షర్మిల, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, నారా లోకేశ్, ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)లను కోర్టు ఆదేశించింది. 

ఇటీవల కాలంలో విపక్షాలకు వివేకా హత్యోదంతం ఓ అస్త్రంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఇదొక కీలక అంశంగా ప్రస్తావిస్తున్నారు. దీనిపై వైసీపీ నేత సురేశ్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా విపక్ష నేతలను పేర్కొన్నారు. వైఎస్ అవినాశ్ రెడ్డే హంతకుడు అని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

ఇవాళ పిటిషనర్ తరఫున అడ్వొకేట్ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న కడప కోర్టు... పిటిషనర్ సురేశ్ బాబుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. వివేకా హత్య గురించి మాట్లాడొద్దని, అవినాశ్ రెడ్డి ప్రస్తావన తీసుకురావొద్దని ప్రతివాదులకు స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
YS Viveka Murder Case
Kadapa Court
Suneetha
Sharmila
Chandrababu
Pawan Kalyan
Daggubati Purandeswari
BTech Ravi
TDP
Janasena
Congress
BJP
YSRCP

More Telugu News