Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్‌తో ఆల్‌రౌండర్లకు తీవ్ర నష్టం.. భారత జట్టుకు మంచిది కాదు: రోహిత్ శర్మ
- ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు తాను వ్యతిరేకమన్న భారత కెప్టెన్
- ఈ రూల్ భారత క్రికెట్‌లోని అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ల ఆటను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న హిట్‌మ్యాన్
- ఇది వాళ్లను వెనక్కి లాగడమేనని వ్యాఖ్య
- ఐపీఎల్ 2023 సీజన్ నుంచి అమలులోకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు తాను వ్యతిరేకమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు క్లబ్ ప్రైరీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్.. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం భారత క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ల ఆటను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది వాళ్లను వెనక్కి లాగడమేనని, భారత జట్టుకు మంచిది కాదన్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ నుంచి అమలులోకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
ఐపీఎల్ 2023లో బిగ్ బాష్ లీగ్ నుండి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీసుకువచ్చారు. అంతకుముందు 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా దేశీవాళి క్రికెట్‌లో ఈ నియమాన్ని పరీక్షించారు. 2023 నుండి ఐపీఎల్ జట్లు ఈ రూల్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. మ్యాచ్ పరిస్థితులపై ఆధారపడి ఒక స్పెషలిస్ట్ బౌలర్ లేదా బ్యాటర్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేందుకు ఈ రూల్ వెసులుబాటు కల్పిస్తుంది.
అసలేంటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..?
మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా జట్లు ఆట మధ్యలో ఒక ఆటగాడిని మార్చుకోవచ్చు. అంటే.. ఒక జట్టు బ్యాటింగ్ సమయంలో మంచి బ్యాటర్‌ను ఆడించవచ్చు. అలాగే అదే జట్టు బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా మంచి బౌలర్‌తో బౌలింగ్ చేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌ని కింది సందర్భాలలో ఎప్పుడైనా బరిలోకి దింపవచ్చు..
ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు
ఒక ఓవర్ ముగిసిన తర్వాత
ఒక ఓవర్ మధ్యలో ఒక బ్యాటర్ రిటైర్డ్ అయినప్పుడు
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి రోహిత్ శర్మ ఏమన్నాడంటే..!
భారత క్రికెట్‌పై ఈ రూల్ ప్రభావం గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లబ్ ప్రైరీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "నేను ఇంపాక్ట్ ప్లేయర్‌కి పెద్ద అభిమానిని కాదు. సాధారణంగా క్రికెట్‌ను 11 మందితోనే ఆడతారు. 12 మందితో కాదు. ఈ రూల్‌ను ఆటలో వినోదం కోసం ప్రవేశపెట్టారు. అయితే దీనివల్ల శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు బ్యాటింగ్‌కే పరిమితం అవుతున్నారు. ఇది వాళ్లను వెనక్కి లాగడమే. భారత జట్టుకూ మంచిది కాడు" అని హిట్‌మ్యాన్ చెప్పాడు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో జట్లు ఆట ప్రారంభంలో పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటే మాత్రం ఆటపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని భారత కెప్టెన్ పేర్కొన్నాడు.