Chandrababu: ఇక్కడ పులి అంటాడు... ఢిల్లీలో పిల్లిలా ఉంటాడు: చంద్రబాబు
- కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభ
- హాజరైన చంద్రబాబు
- కార్యకర్తలు కసిగా పనిచేయాలని పిలుపు
ఏపీ చరిత్రను, ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ ఆయన కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. నా ప్రాణ సమానమైన కార్యకర్తలు కసిగా పనిచేయాలి... దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని పిలుపునిచ్చారు. సైకో రెడ్డి రాష్ట్రం నుంచి మీ ఓటుతో తరిమికొట్టండి... తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం... సాధారణ కార్యకర్త వీరభ్రద గౌడ్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని వివరించారు.
"ఒక ఎంపీటీసీని... ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాం. కురబ కులస్తుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళతాడని మీరు ఊహించారా? వీరిద్దరినీ గెలిపించడం అనేది ప్రజాస్వామ్యానికి మీరిచ్చే గౌరవం అవుతుంది. వీరిద్దరినీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఆలూరు ప్రజలు అదరగొడుతున్నారు. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కదం తొక్కుతోంది. ముస్లింలకు న్యాయం చేసేది టీడీపీనే" అని స్పష్టం చేశారు.
జనసేన, బీజేపీ కార్యకర్తలు సైతం ముందుకు రావాలి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు అండగా నిలబడాలని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలనే ఉద్దేశంతో పొత్తుకు ముందుకొచ్చాం. మేము సైతం పనిచేస్తామని జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు ముందుకు రావాలి. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏనే.
మన రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ సహకారం ఎంతో అవసరం. అందుకే జట్టు కట్టాం. మైనారిటీ సోదరులందరూ ముందుకొచ్చి కూటమి గెలుపుకు కృషిచేయాలి. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా నిలబడతాం. ఆర్థికంగా ఆదుకుంటాం.
గెలిపిస్తే ఏం చేశాడు?... రాష్ట్రాన్ని గాలికొదిలేశాడు
ముఖ్యమంత్రిగా గెలిపిస్తే జగన్ రెడ్డి ఏం చేశాడు? ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నాడు. ఇక్కడ పులి అంటాడు...ఢిల్లీలో పిల్లిలా ఉంటాడు. రాష్ట్రాన్ని గాలికొదిలేశాడు. 13 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. కేంద్రం సహకారంతో భవిష్యత్ లో అందరి జీవితాల్లో వెలుగులు తెస్తాం. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా.
అధికార మదంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. జగన్ రెడ్డికి జే గన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాక మరేలా పిలుస్తాం. నిన్నటి వరకూ పరదాలు కట్టుకుని తిరిగాడు. నేడు నెత్తిన చేయిపెడుతున్నాడు.
సీమలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా జగన్
నేను సాగునీటి ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లు ఖర్చు చేశా. ఈ ఐదేళ్లలో రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇచ్చాడా. సాగు, తాగునీరు ఇచ్చాడా అని అడుగున్నా. దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సీమకు ఒక్క పరిశ్రమ తెచ్చాడా. ఉద్యోగం ఇచ్చాడా, డీఎస్సీ తెచ్చాడా? వాలంటీర్ ఉద్యోగం ఇస్తే ఉపాధి కల్పించినట్టేనా?
జగన్ రెడ్డి మాత్రమే పెత్తనం చేస్తుంటాడు... మనమంతా బానిసలుగా ఉండాలి. మీ జీవితాలు బాగుపడ్డాయా, మీ ఆదాయాలు పెరిగాయా, మీ కష్టాలు తీరాయా? వరి టమాటా, మిరప, పత్తి, రైతులు బాగున్నారా? రైతు భరోసా కేంద్రాలు కాదు... రైతు దగా కేంద్రాలు అవి.
నీరిస్తే పొలాలు బంగారం పండుతాయి. కానీ దుర్మార్గుడు నీరివ్వకుండా ప్రగల్భాలు పలుకుతున్నాడు. స్కూలుకు రంగులు కొడితే నాణ్యత పెరుగుతుందని ఆలోచించే దుర్మార్గుడు జగన్ రెడ్డి.