YS Avinash Reddy: అఫిడవిట్‌లో కేసులు, ఆస్తులు, అప్పులను వెల్లడించిన అవినాశ్ రెడ్డి
- హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం ఆరోపణలతో సీబీఐ కేసులు పెట్టిందన్న ఎంపీ
- వివేకా కేసులో ఏ-8గా ఉన్నానని ప్రస్తావన
- మైదుకూరులో కూడా ఓ క్రిమినల్ కేసు ఉందని వెల్లడి
- మొత్తం రూ.25.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడి
- కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేసిన వైఎస్ అవినాశ్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి వెల్లడించారు. హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి ఆరోపణలతో సీబీఐ తనపై కేసులు పెట్టిందని వివరించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తాను ఏ-8గా ఉన్నానని ప్రస్తావించారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో ఈ వివరాలను పొందుపరిచారు.
ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో తనపైన కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోందని వివరించారు. ఈ కేసు విషయమై సీబీఐ కోర్టుకు రూ.2 లక్షల నగదు పూచీకత్తుగా డిపాజిట్ చేశానని వివరించారు. మైదుకూరులో కూడా తనపై ఓ క్రిమినల్ కేసు నమోదయిందని అవినాశ్ పేర్కొన్నారు.
రూ.25.51 కోట్ల ఆస్తులున్నాయ్..
ఎన్నికల అఫిడవిట్‌లో వైఎస్ అవినాశ్ రెడ్డి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనతో పాటు భార్య సమత పేరుపై మొత్తం రూ.25.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తనకు రూ.32.75 లక్షల విలువైన ఇన్నోవా కారు ఉందని పేర్కొన్నారు. భూముల విషయానికి వస్తే... భార్య పేరిట విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లా వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్టలో 33.90 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. ఇక పులివెందుల మండలం వెలమవారిపల్లె, భాకరాపురం, అంకాళమ్మగూడూరు ప్రాంతాల్లో 27.40 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. రూ.23.11 లక్షల విలవైన బంగారం ఉందని చెప్పారు.
అప్పులు రూ.9.13 కోట్లు..
తన చేతిలో రూ.14,36,200 నగదు ఉందని, తన భార్య వద్ద రూ.8,06,500 ఉందని అవినాశ్ రెడ్డి తెలిపారు. ఇక వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులు లేవని వివరించారు. ఎల్‌ఐసీ పాలసీ ఉందని పేర్కొన్నారు. రూ.9.13 కోట్ల అప్పులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. తనకు ఏ వ్యక్తులు, సంస్థలు చెల్లించాల్సినవి ఏమీ లేవని చెప్పారు.