Vijayasai Reddy: వేమిరెడ్డి రూ. 1000 కోట్లు.. నారాయణ రూ. 500 కోట్లు ఖర్చుపెడతారట: విజయసాయిరెడ్డి
- టీడీపీ ఇచ్చే డబ్బులు తీసుకుని వైసీపీకి ఓటు వేయాలన్న విజయసాయి
- 100 మంది వాలంటీర్లను టీడీపీలోకి నారాయణ చేర్చుకున్నారని విమర్శ
- కామన్ సివిల్ కోడ్ పై టీడీపీ వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్
నెల్లూరు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 1000 కోట్లు, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ అభ్యర్థి పి.నారాయణ రూ. 500 కోట్లు ఖర్చు పెడతారట అని ఆరోపించారు. ఎన్నడూ లేనంతగా నెల్లూరు జిల్లాలో డబ్బు రాజకీయాలను తీసుకొచ్చిన ఘనత టీడీపీ నేతలదేనని విమర్శించారు. టీడీపీ నేతలు ఇచ్చే డబ్బును తీసుకోవాలని... ఓటు మాత్రం వైసీపీకి వేయాలని ఓటర్లకు సూచించారు.
నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్న టీడీపీ నేతల్లో పలువురు వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లేనని విజయసాయి ఎద్దేవా చేశారు. 100 మంది వాలంటీర్లను నిన్ననే టీడీపీలోకి నారాయణ చేర్చుకున్నారని... నారాయణ విద్యా సంస్థల్లో వీరందరికీ ఉద్యాగాలు ఇస్తానని నారాయణ హామీ ఇచ్చారని విమర్శించారు. వాలంటీర్లు టీడీపీలోకి వెళ్లినా వారి మనసు వైసీపీతోనే ఉందని... మళ్లీ వాళ్లంతా వైసీపీలోకే వస్తారని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని విజయసాయి తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ఎవరితోనూ చేతులు కలపలేదని అన్నారు. త్వరలోనే బీజేపీ కామన్ సివిల్ కోడ్ తీసుకురానుందని... దీనిపై ముస్లింలు, క్రిస్టియన్లు ఆందోళన చెందుతున్నారని... ఈ అంశంపై టీడీపీ వైఖరి ఏమిటో ఎన్నికలకు ముందే చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే పార్టీ టీడీపీ అని మండిపడ్డారు.
జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని విజయసాయి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే... జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందని చెప్పారు.