BJP: ఉదయనిధి స్టాలిన్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... ఇదీ కాంగ్రెస్ అంటూ బీజేపీ నేత స్పందన
- ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారని వెల్లడి
- రేపు కేరళలోనూ ఎన్నికల తర్వాత ఇలాగే విమర్శలు గుప్పిస్తారని ఎద్దేవా
- ఇండియా కూటమి అసలు స్వరూపం ఇదీ అన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే
తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై గతంలో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారని... రేపు కేరళలో ఎన్నికలు ముగియగానే అక్కడి నేతలపై విమర్శలు గుప్పించడం ప్రారంభిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే విమర్శించారు. 'ఇదే ఇండియా కూటమి అసలు స్వరూపం' అన్నారు.
డీఎంకే, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని 39 లోక్ సభ నియోజకవర్గాల్లో నిన్న పోలింగ్ పూర్తయింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి... ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై బీజేపీ నేత వినోద్ పైవిధంగా స్పందించారు.
శనివారం వినోద్ మాట్లాడుతూ... బెంగాల్లో షాజహాన్ షేక్‌ను మమతా బెనర్జీ ఎలా అయితే రక్షిస్తున్నారో... అలాగే కర్ణాటకలోని కాంగ్రెస్ నేతృత్వంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కాంగ్రెస్ కౌన్సిలర్ కుమార్తె నేహా హత్యలోనూ నిందితుడు ఫయాజ్ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది లవ్ జిహాద్ కేసు అని.. కానీ ముఖ్యమంత్రి దీనిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలని... కానీ మహిళల రక్షణ అవసరం లేదని విమర్శించారు. నిందితులు ఏ మతానికి సంబంధించిన వారు అనే అంశంతో సంబంధం లేకుండా నేహ హత్య కేసులో నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు.