SRH: 6 ఓవర్లలోనే 125 పరుగులు... సన్ రైజర్స్ ఓపెనర్ల ఊచకోత వేరే లెవల్!
- ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ దూకుడు
- తొలి పవర్ ప్లేలో వీర బాదుడు
- పోటాపోటీగా సిక్సర్లు బాదిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
- సన్ రైజర్స్ సునామీకి కళ్లెం వేసిన కుల్దీప్ యాదవ్
ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల వీర మాస్ కొట్టుడు చూసిన వారికి... తాము చూస్తున్నది హైలైట్సా... లేక మ్యాచా? అనే సందేహం కలగడం ఖాయం. వారిద్దరూ ఆ విధంగా ఉతికారేశారు. దొరికిన బంతిని దొరికినట్టు చితకబాదారు. ఏదో... బంతిని చేత్తో పట్టుకుని బౌండరీ లైన్ అవతలికి విసిరేసినట్టుగా సిక్సర్ల వర్షం కురిపించారు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో రెండో బంతికి సిక్స్ కొట్టడం ద్వారా ట్రావిస్ హెడ్ పరుగుల సునామీకి గేట్లెత్తాడు. అక్కడ్నించి అతడ్ని ఆపడం ఢిల్లీ బౌలర్లకు శక్తికి మించినపనైంది. హెడ్ కేవలం 16 బంతుల్లోనే 50 పరుగులు చేశాడంటే దంచుడు ఏ రేంజిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ సైతం విరుచుకుపడడంతో స్కోరు బోర్డు వాయువేగంతో పరుగులుపెట్టింది.
తొలి ఓవర్ ముగిసేసరికి 19, రెండో ఓవర్ కు 40, మూడో ఓవర్ కు 62, నాలుగో ఓవర్ కు 83, ఐదో ఓవర్ కు 103 పరుగులు... సన్ రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ఇలా కొనసాగింది. ఇక పవర్ ప్లే 6 ఓవర్లు ముగిశాక సన్ రైజర్స్ స్కోరు వికెట్ నష్టపోకుండా 125 పరుగులు.
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్ కు వచ్చి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ తుపాను నిదానించింది. తొలుత అభిషేక్ శర్మను అవుట్ చేసిన కుల్దీప్... అదే ఊపులో ఐడెన్ మార్ క్రమ్ (1)ను కూడా పెవిలియన్ కు తిప్పి పంపాడు. అభిషేక్ శర్మ 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు.
ఆ తర్వాత హెడ్, హెన్రిచ్ క్లాసెన్ జోడీ దూకుడు కొనసాగించింది. ఈ దశలో మరోసారి బౌలింగ్ కు వచ్చిన కుల్దీప్ యాదవ్... ప్రమాదకర హెడ్ ను అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు ఊపిరి పీల్చుకుంది. హెడ్ 32 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. ఈ డాషింగ్ ఓపెనర్ 11 ఫోర్లు, 6 సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. ఆ తర్వాత క్లాసెన్ ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో హైదరాబాద్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 10 ఓవర్ల అనంతరం 4 వికెట్లకు 158 పరుగులు. తెలుగుతేజం నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.