Adimulapu Suresh: ఏపీ మంత్రి సురేశ్ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు
- మంత్రి తరఫున వైసీపీ నేతలతో నామినేషన్ దాఖలు చేయించడంపై విమర్శ
- ప్రభుత్వ అధికారి అయిన విజయలక్ష్మి ఆర్వో ఆఫీసుకు వెళ్లడంపై టీడీపీ నేతల అభ్యంతరం
- జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి, కొండపి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేశ్ భార్యపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన విజయలక్ష్మీ వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్ వేయించడం, దగ్గరుండి అన్నీ పర్యవేక్షించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కూటమి టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నాయకుడు కొర్రపాటి వీరభోగ వసంతరావులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19న విజయలక్ష్మీ తన భర్త ఆదిమూలపు సురేశ్ తరఫున వైసీపీ నాయకులతో నామినేషన్ వేయించారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి, వైసీపీ నాయకులకు మద్దతుగా నామినేషన్ వ్యవహారాలు చూసుకోవడమేంటని ప్రశ్నించారు. దీనిపై జిల్లా రిటర్నింగ్ అధికారి (కలెక్టర్) తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఐఆర్ఎస్ అధికారి విజయలక్ష్మీపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.