Nara Brahmani: ఏపీకి రాజధాని లేక ఉపాధి అవకాశాలు కరువు: నారా బ్రాహ్మణి
- బేతపూడి పర్యటనలో నారా బ్రాహ్మణి
- సమస్యల పరిష్కారానికి టీడీపీని గెలిపించడమే ఏకైక మార్గం
- పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేక యువతకు ఉపాధి అవకాశాలు దొరకడంలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి చెప్పారు. రాజధాని లేక వసతుల లేమితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదన్నారు. ఉపాధి దొరకక యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈమేరకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళగిరి మండలం బేతపూడిలో శనివారం పర్యటించారు. ప్రచారంలో భాగంగా పూల తోటకు వెళ్లిన బ్రాహ్మణి.. అక్కడున్న కూలీలతో కలిసి పూలు కోస్తూ మాట్లాడారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేక ఉపాధి కోల్పోయామని, పరిశ్రమలు లేక తమ పిల్లలకు ఉద్యోగాలు దొరకట్లేదని, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్ తొలగించారని కూలీలు వాపోయారు. తమ కష్టాలను, సమస్యలను బ్రాహ్మణికి చెప్పుకున్నారు. నారా బ్రాహ్మణి స్పందిస్తూ.. ఇప్పుడున్న సమస్యలు అన్నింటికీ ఒక్కటే పరిష్కారమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు.