K Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
- గతంలో కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరుతూ మరోసారి పిటిషన్లు
- రేపటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైతే మరోమారు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై నేడు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, జైల్లో ఉంటే అవి మరింతగా పెరిగి ఇబ్బందిగా మారుతుందని కవిత తన బెయిల్ పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిపై కోర్టు విచారణ చేపట్టనుంది.
మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజుల ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఈలోపు సీబీఐ ఈ నెల 11న కవితను తీహార్ జైల్లో అరెస్టు చేసింది.
ఇదిలా ఉంటే, తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, కవిత సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తంటూ కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఈనేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకున్న ఆరోగ్య సమస్యల రీత్యా బెయిల్ కావాలని కవిత విజ్ఞప్తి చేశారు.
సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తే.. కవిత కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంది.