columbia university: కొలంబియా యూనివర్సిటీ వద్ద పాలస్తీనా అనుకూల ర్యాలీ!
- విద్యార్థుల యూదు వ్యతిరేక నిరసనలపై సర్వత్రా విమర్శలు
- కాలేజీ క్యాంపస్ లలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలను ఖండించిన వైట్ హౌస్
- ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హింసకు పిలుపునివ్వడం సరికాదని స్పష్టీకరణ
కాలేజీ క్యాంపస్ లలో యూదుల వ్యతిరేక నిరసనలు జరుగుతుండటాన్ని అమెరికా వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. “శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి అమెరికన్ కు ఉంది. కానీ యూదు విద్యార్థులు, యూదు సమాజంపై భౌతిక దాడులు, హింసకు పిలుపునివ్వడం ఎంతమాత్రం సరికాదు. ఇవి ప్రమాదకర యూదు వ్యతిరేక చర్యలే. ఇలాంటి నిరసనలకు ఏ కాలేజీ క్యాంపస్ లోనూ, అమెరికా భూభాగంపై ఎక్కడా చోటు లేదు” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆండ్రూ బట్స్ పేర్కొన్నారు.
కొలంబియా యూనివర్సిటీలో కొన్ని రోజుల కిందట జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీని న్యూయార్క్ సిటీ పోలీసులు చెదరగొట్టారు. 100 మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ప్రకటన వెలువడటం గమనార్హం. వైట్ హౌస్ తన ప్రకటనలో ప్రత్యేకంగా ఏ యూనివర్సిటీ పేరును ప్రస్తావించలేదు. కానీ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై కాలేజీ క్యాంపస్ లలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ ఉదంతాలు చెప్పకనే చెప్పాయి.
కొలంబియా యూనివర్పిటీ క్యాంపస్ లో యూదు వ్యతిరేక నిరసనలను న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఖండించారు. ఈ ఘటనలో చట్ట ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించినట్లు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. న్యూయార్క్ నగరంలో ద్వేషానికి చోటులేదన్నారు.
క్యాంపస్ లో యూదు వ్యతిరేక నిరసనలపై ఏర్పాటైన విచారణ కమిటీ ఎదుట కొలంబియా వర్సిటీ ప్రెసిడెంట్ నెమాత్ షఫీక్ హాజరై వివరణ ఇచ్చిన మర్నాడే కొలంబియా వర్సిటీలో భారీ ర్యాలీ మొదలైంది. పోలీసులు అరెస్టు చేసిన 108 మంది విద్యార్థుల్లో మిన్నెసోటా డెమొక్రాట్ ఇల్హన్ ఒమర్ కుమార్తె ఇస్రా హిర్సీ కూడా ఉంది. ఇజ్రాయెల్ పై గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని కొందరు కొలంబియా ప్రొఫెసర్లు ప్రశంసించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై షఫీక్ ను పలువురు అమెరికా చట్ట సభల ప్రతినిధులు బుధవారం ప్రశ్నించారు. వారిలో న్యూయార్క్ రిపబ్లికన్ అయిన ఎల్సీ స్టెఫానిక్ ఒకరు. యూనివర్సిటీ నిర్వహణలో షఫీక్ నాయకత్వ తీరును ఆమె విమర్శించారు. యేల్ యూనివర్సిటీ క్యాంపస్ లోనూ గత ఆదివారం నిరసనలు జరిగాయి. మరోవైపు హార్వర్డ్ యూనివర్సిటీ తమ క్యాంపస్ లో నిరసనలను నివారించేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.