Revanth Reddy: నిజామాబాద్ సభలో కవితపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- కవిత, అర్వింద్‌లు నిజామాబాద్ ప్రజలను మోసం చేశారన్న ముఖ్యమంత్రి
- కవిత ఏం చేయలేదు కాబట్టే ప్రజలు ఓడించారని వ్యాఖ్య
- అర్వింద్ స్పైసిస్ బోర్డు తీసుకువచ్చి పసుపుబోర్డు అంటున్నారని విమర్శ
నిజామాబాద్ నుంచి 2014లో ఎంపీగా గెలిచిన కవిత ఏం చేశారో చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ ప్రజలను వీరిద్దరూ మోసం చేశారని విమర్శించారు. ఈ నియోజకవర్గానికి కవిత ఏం చేశారు? అని ప్రశ్నించారు. అందుకే నిజామాబాద్ ప్రజలు ఆమెను ఓడించారన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదన్నారు.
మరోవైపు ధర్మపురి అర్వింద్ స్పైసిస్ బోర్డు తీసుకువచ్చి పసుపు బోర్డుగా చెబుతున్నారని మండిపడ్డారు. ఇక్కడి రైతులు అందరూ ప్రతి విషయాన్ని గమనిస్తున్నారన్నారు. ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17లోగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీచేసి వారి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి వేసినట్లేనని... ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తనదే అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మతాలను కూడా రాజకీయాలకు బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మాత్రం వరి వేశారని గుర్తు చేశారు. రైతులు ఎంత పంట అయినా పండించవచ్చునని... ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తమదే అన్నారు. నిజామాబాద్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు.