Hero Vishal: కొత్త పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: హీరో విశాల్
- 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న విశాల్
- పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రానని వెల్లడి
- తాను ఏ పార్టీనీ విమర్శించడం లేదన్న విశాల్
తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తమిళ ప్రముఖ నటుడు విశాల్ మరోసారి స్పష్టం చేశాడు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని ప్రకటించాడు. పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రాబోనని అన్నాడు. రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు.
అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏ పార్టీనీ తాను విమర్శించడం లేదని, పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రానవసరం ఉండదని విశాల్ అభిప్రాయపడ్డాడు. గ్రామీణ ప్రజలకు ముఖ్యమైన వసతులు పూర్తిస్థాయిలో కల్పించలేదని, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా వాటిని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
హరి దర్శకత్వంలో ‘రత్నం’ సినిమాలో నటిస్తున్న హీరో విశాల్.. చిత్రీకరణ కోసం సోమవారం తమిళనాడులోని సేలం వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నటుల సంఘం భవన నిర్మాణాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విశాల్ తెలిపాడు. ఇక ఈ భవనానికి ‘విజయకాంత్’ పేరు పెట్టడంపై జనరల్ కమిటీలో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపాడు.