Supreme Court: యాడ్ ల సైజులోనే మీ క్షమాపణ ఉందా?: సుప్రీంకోర్టు

Apology Same Size As Ads Supreme Court Grills Ramdev Aide Balkrishna
  • పతంజలి ఆయుర్వేద కేసులో బాబా రాందేవ్, అనుచరుడు బాలకృష్ణపై ప్రశ్నల వర్షం
  • రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి 67 పత్రికల్లో క్షమాపణ ప్రకటనలు ఇచ్చామన్న వారి తరఫు లాయర్
  • అదంతా తమకు అనవసరమన్న కోర్టు.. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలిస్తామని పిటిషనర్
  • కేసు తదుపరి విచారణ వారంపాటు వాయిదా
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన సైజ్ లోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా? అని పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, బాలకృష్ణను ప్రశ్నించింది. వారి తరఫున విచారణకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ తాజాగా కోర్టుకు మరోసారి క్షమాపణ అఫిడవిట్లను సమర్పించారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. గతంలో క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు ఎందుకు ఆ అఫిడవిట్లను దాఖలు చేశారని అడిగింది. దీనికి ముకుల్ రోహత్గీ బదులిస్తూ “రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి 67 వార్తాపత్రికల్లో క్షమాపణ ప్రకటనలు ఇచ్చాం” అని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఘాటుగా స్పందించారు. “మీ క్షమాపణను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీరిచ్చిన ప్రకటనల తరహాలోనే అంతే పెద్ద అక్షరాలు, పెద్ద సైజులో క్షమాపణ ఉందా?” అని నిలదీశారు. అయితే క్షమాపణ చెప్పేందుకు కంపెనీ రూ. లక్షల్లో ఖర్చుపెట్టిందని ముకుల్ రోహత్గీ గుర్తుచేయగా ఆ విషయం తమకు అవసరంలేదని కోర్టు వ్యాఖ్యానించింది.

అదే సమయంలో పతంజలి సంస్థపై కోర్టుకెక్కిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు రూ. వెయ్యి కోట్ల జరిమానా విధించాలంటూ పిటిషన్ దాఖలు కావడంపై కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. “ఇది మీకు బదులుగా వేయించిన పిటిషనా? మా అనుమానం అదే” అని వ్యాఖ్యానించింది. అయితే ఈ పిటిషన్ తో తమ క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. వార్తాపత్రికల్లో మరింత పెద్ద సైజులో క్షమాపణ ప్రచురిస్తామని చెప్పారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు వారంపాటు వాయిదా వేసింది.

ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో అన్ని జాతీయ వార్తాపత్రికల్లో మంగళవారం పతంజలి ఆయుర్వేద సంస్థ క్షమాపణ ప్రకటన ఇచ్చింది. సుప్రీంకోర్టు అంటే తమకు అపార గౌరవం ఉందని.. ఇకపై తాము పొరపాట్లు చేయబోమని ఆ ప్రకటనలో పేర్కొంది. షుగర్, బీపీ లాంటి వ్యాధులను తమ ఉత్పత్తులు నయం చేస్తాయంటూ పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు గతంలో తప్పుబట్టింది. అలాగే ఈ విషయంపై ముందుగా మీడియాకు క్షమాపణ అఫిడవిట్లు విడుదల చేసి ఆ తర్వాత వాటిని కోర్టుకు సమర్పించడంతో న్యాయస్థానం వారి క్షమాపణలను తిరస్కరించింది.
Supreme Court
patanjali ayurved
apology
case
Baba Ramdev

More Telugu News