Rohit Sharma: వాళ్లింకా రోహిత్ శర్మే ముంబయి కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
- ఈ సీజన్ లో ముంబయి కెప్టెన్ గా నియమితుడైన హార్దిక్ పాండ్యా
- పంజాబ్ బ్యాటింగ్ చేస్తుండగా ఫీల్డింగ్ మోహరింపుపై రోహిత్ శర్మతో చర్చించిన మధ్వాల్
- ఈ విషయంలో మార్పు రావాల్సి ఉందన్న ఇర్ఫాన్ పఠాన్
ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు స్వీకరించినప్పుటికీ, నాయకుడిగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆటగాడిగానూ విఫలమవుతున్నాడు. టోర్నీలో ఇప్పటిదాకా 8 మ్యాచ్ లు ఆడిన ముంబయి జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది.
ఈ నేపథ్యంలో, ఇటీవల పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పంజాబ్ బ్యాటింగ్ సమయంలో ముంబయి పేసర్ మధ్వాల్ ఫీల్డింగ్ సెట్ చేసేందుకు రోహిత్ శర్మతో మాట్లాడుతుండడం కనిపించింది. కెప్టెన్ గా మైదానంలోనే ఉన్న హార్దిక్ పాండ్యాను వదిలేసి ఆ యువ ఆటగాడు రోహిత్ శర్మ వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మధ్వాల్... రోహిత్ శర్మతో మాట్లాడుతుండగా, పక్కనే ఉన్న హార్దిక్ పాండ్యా చూస్తూ ఉండిపోయాడు.
దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. కొందరు ముంబయి ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మే తమ కెప్టెన్ అనుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయాల్సిన మధ్వాల్... ఎలాంటి ప్లాన్ అమలు చేయాలన్న విషయం చర్చించేందుకు రోహిత్ శర్మ వద్దకు వెళ్లాడని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.
రోహిత్ శర్మ నాయకత్వంపై ఆటగాళ్లలో బలమైన నమ్మకం ఉందని, కానీ కెప్టెన్ గా మరొకరు ఉన్నప్పుడు ఈ విషయంలో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. నాయకత్వ పరంగా హార్దిక్ పాండ్యా ఈ మేరకు మార్పు తీసుకురాగలడని తాను భావిస్తున్నట్టు తెలిపాడు.