CSK: రుతురాజ్ సెంచరీ, దూబే ఫైర్... సీఎస్కే భారీ స్కోరు
- ఐపీఎల్ లో ఇవాళ సీఎస్కే × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
- మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు
సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించడం, శివమ్ దూబే మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడం చెన్నై ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డర్లు పలు క్యాచ్ లను జారవిడిచి తగిన మూల్యం చెల్లించుకున్నారు.
సీఎస్కే ఇన్నింగ్స్ లో ఓపెనర్ అజింక్యా రహానే (1) స్వల్ప స్కోరుకే అవుటైనా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచాడు. గైక్వాడ్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
డారిల్ మిచెల్ (11), రవీంద్ర జడేజా (16) ఆశించిన మేర రాణించలేదు. అయితే యువ ఆటగాడు శివమ్ దూబే వీరబాదుడుతో లక్నో బౌలర్లను బెంబేలెత్తించాడు. దూబే 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆఖర్లో ధోనీ వచ్చి ఒక బంతిని ఎదుర్కొని ఫోర్ కొట్టాడు.
లక్నో బౌలర్లలో మాట్ హెన్రీ 1, మొహిసిన్ ఖాన్ 1, యశ్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.