gaza: అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు ఉద్ధృతం

Anger Spikes At US Universities As Gaza Protests Intensify
  • ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా గళమెత్తిన విద్యార్థులు
  • గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ పరిస్థితులపై మండిపాటు
  • క్యాంపస్ లలో ఆందోళనలు, తరగతుల బహిష్కరణ
  • వందలాది మంది అరెస్టు.. తమ భద్రతపై యూదు విద్యార్థుల్లో భయాందోళనలు 
అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో గత కొన్ని వారాలుగా విద్యార్థులు చేపడుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. సామూహిక అరెస్టులు, తరగతుల బహిష్కరణతో వర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం వల్ల గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ పరిస్థితులపై విద్యార్థులు మండిపడుతున్నారు.

మంగళవారం వివిధ వర్సిటీల క్యాంపస్ లలోని విద్యార్థులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నిరసనలకు కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు మరో అడుగు ముందుకేశారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న మానవ హననం, చూపుతున్న వివక్షతో లాభపడుతున్న కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను యూనివర్సిటీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ నిరసనలపై ఇజ్రాయెల్ అనుకూల మద్దతుదారులు, ఇతర విద్యార్థులు క్యాంపస్ లలో తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని క్యాంపస్ లు యూదు వ్యతిరేక దాడులు, బెదిరింపులు, విద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

మరోవైపు క్యాంపస్ లో నిరసనలను ఆపేందుకు కొలంబియా యూనివర్సిటీ చర్యలు తీసుకుంటోంది. “విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ ఇతర విద్యార్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు, క్యాంపస్ లో ఇబ్బందులు సృష్టించేందుకు వీల్లేదు. యూదు విద్యార్థుల భయాందోళనలపై మేం స్పందిస్తున్నాం. వర్సిటీ అధికారులు నిరసనకారులతో చర్చలు జరుపుతున్నారు” అని కొలంబియా యూనివర్సిటీ ప్రజా సంబంధాల వైస్ ప్రెసిడెంట్ బెన్ చాంగ్ తెలిపారు.

వర్సిటీలోని కొందరు ప్రొఫెసర్లు గత వారం ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింతగా రాజేసింది. అయితే వర్సిటీ ప్రెసిడెంట్ మినోచ్ షఫీక్ నిరసనలకు దిగిన విద్యార్థుల అరెస్టు కోసం పోలీసులను పిలవడంతో ప్రొఫెసర్లు కాస్త వెనక్కి తగ్గారు. విద్యార్థుల సస్పెన్షన్ల గురించి తాము బలవంతపెట్టబోమని కొందరు ప్రొఫెసర్లు పేర్కొన్నారు.

అమెరికా వర్సిటీల్లో విద్యార్థుల మధ్య ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం గురించి సుదీర్ఘకాలంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే ఈసారి ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం క్యాంపస్ లలో ఉద్రిక్తతలకు దారితీయడం మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే దీనిచుట్టూ రాజకీయం ముసురుకుంటోంది.

న్యూయార్క్ యూనివర్సిటీలో బయటి వ్యక్తులు నిరసనలలో పాల్గొనడంతో పోలీసులు ఇప్పటివరకు 133 మందిని అరెస్టు చేసి కోర్టు సమన్ల అనంతరం విడుదల చేశారు. దీనికి నిరసనగా వందలాది మంది వర్సిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీ వాకౌట్ చేశారు.

మరోవైపు క్యాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలోని పరిపాలనా భవనాన్ని నిరసనకారులు స్వాధీనం చేసుకోవడంతో బుధవారం వరకు వర్సిటీని మూసేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అలాగే మసాచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, యూసీ బెర్క్ లే, యేల్ వర్సిటీల్లోనూ నిరసనలు జరిగాయి. దీంతో సోమవారం 47 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
gaza
protests
america universities
students
anger
Israel

More Telugu News