gynaecologist: గర్భిణీకి చికిత్స నిరాకరించిన వైద్యుడు.. ఆయన చూపిన కారణంపై ఆసక్తికర చర్చ
- సూచించిన పరీక్షలు చేయించుకోనందున వైద్యాన్ని తిరస్కరించిన గైనకాలజిస్ట్
- పెషెంట్లు వైద్యులను ఎంచుకున్నట్టే, వైద్యులు రోగులను తిరస్కరించే హక్కు ఉంటుందన్న గుజరాత్ గైనకాలజిస్ట్
- సరికాదంటూ కొందరు.. సమర్థిస్తూ ఇంకొందరు.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
వైద్య చికిత్సలకు సంబంధించిన డాక్టర్ల ప్రణాళికలను రోగులు నిర్దేశించే పరిస్థితుల్లో వైద్యాన్ని తిరస్కరించవచ్చంటూ గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఓ గైనకాలజిస్ట్ చెబుతున్నారు. ఈ కారణాన్ని చూపి ఓ 30 ఏళ్ల గర్బిణీకి చికిత్స నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. తాను చెప్పిన అవసరమైన పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించడంతో తాను చికిత్సను తిస్కరించానంటూ రాజేశ్ పారిఖ్ అనే గైనకాలజిస్ట్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు.
పెషెంట్లు తమ వైద్యులను ఎంచుకునే హక్కు ఉన్నట్టుగానే అత్యవసర పరిస్థితుల్లో మినహా రోగులకు చికిత్సను తిరస్కరించే హక్కు వైద్యులకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకోనందున ఒక రోగికి చికిత్స అందించలేదని చెప్పారు. ఆమె వైద్య సలహాను విస్మరించిందని అన్నారు. అంతేకాకుండా వైద్యరంగంతో సంబంధంలేని తన స్నేహితుల సలహా విని ఎన్‌టీ స్కానింగ్, డబుల్ మార్కర్ పరీక్ష (క్రోమోజోమ్ లోపాలను నిర్ధారించే పరీక్ష) చేయించుకోలేదని ప్రస్తావించారు. వైద్యం చేయాలంటూ ఆమె పలుమార్లు కోరినప్పటికీ, మరో వైద్యుడిని వెతుక్కోవాలని సలహా ఇచ్చానని రాజేశ్ పారిఖ్ పేర్కొన్నారు.
గైనకాలజిస్ట్ రాజేశ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక వైద్యుడిగా, ప్రత్యేకించి గైనకాలజిస్టుగా పెషెంట్‌కి ఎప్పుడూ చికిత్స నిరాకరించకూడదని, కోర్టులో తదుపరి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. క్లినిక్‌ల నుంచి కమీషన్ల కోసమే ఈ పరీక్షలు ఆయన సూచించారని తాను భావిస్తున్నానని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి మాత్రం వైద్యుడిని సమర్థించాడు. అవసరమైతేనే టెస్టులు సూచిస్తారని పేర్కొన్నాడు.
కాగా డబుల్ మార్కర్ టెస్ట్ చాలా ఖరీదైనదని, డాక్టర్లు అధిక కమీషన్లు పొందేందుకు దీనిని రాస్తుంటారని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. తాను రోగిని పూర్తిగా నిందించలేనని, వైద్య రంగం కోల్పోయిన విశ్వాసానికి ఆయన ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించాడు. అయితే మరో యూజర్ వైద్యుడిని సమర్థించారు. ధైర్యంగా వైద్యాన్ని తిరస్కరించారని, ‘డౌన్ సిండ్రోమ్’ లోపంతో బిడ్డ పుడితే న్యాయ వ్యవస్థ ఇబ్బందులను చవిచూడాల్సి ఉంటుందని, కోర్టులు విధించే ఆర్థిక జరిమానాలు మిమ్మల్ని దివాలా తీయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.