EVM: మధ్యాహ్నం 2 గంటల్లోగా వీవీ ప్యాట్ లపై స్పష్టత ఇవ్వండి: ఈసీకి సుప్రీంకోర్టు సూచన

SC seeks clarification from EC by 2 pm today on pleas seeking cross verification of votes
  • ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో కొనసాగుతున్న విచారణ
  • ఈవీఎంల సమర్థతను సందేహించొద్దని పిటిషనర్లకు కోర్టు హితవు
  • బ్యాలెట్ పత్రాలతో ఎన్నికల నిర్వహణ డిమాండ్ ను తప్పుబట్టిన ధర్మాసనం
  • దేశంలో ఎన్నికల నిర్వహణ అతిభారీ కసరత్తు అని వ్యాఖ్య
ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్ ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే విచారణకు ఈసీ తరఫు ప్రతినిధి హాజరై తమ ప్రశ్నలకు బదులివ్వాలని సూచించింది.

ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను ఓటర్లు సంపూర్ణంగా ధ్రువీకరించుకొనేలా ఈసీ మార్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అలా కుదరకుంటే గతంలో అమలు చేసిన బ్యాలెట్ పత్రాల పద్ధతిని ఈసీ అమలు చేసేలా చూడాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల వినతిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించనుంది. అంతకుముందు దీనిపై తీర్పును సుప్రీంకోర్టు ఈ నెల 18కి రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వ్యవస్థపై ఓటర్ల నమ్మకం, సంతృప్తికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపింది. అయితే అదే సమయంలో ఈవీఎంల సమర్థతను అనుమానించొద్దని, ఎన్నికల సంఘం మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. 

పిటిషనర్లలో ఒకటైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్నికల సంఘం 2017లో వీవీ ప్యాట్ ల యంత్రాలకు చేసిన మార్పులను ఉపసంహరించేలా ఆదేశించాలని కోరింది. వీవీ ప్యాట్ యంత్రాల్లోని పారదర్శక గాజుఫలకం స్థానంలో కాంతి నిరోధక గాజుఫలకాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. దీనివల్ల ఓటరు కేవలం 7 సెకన్లపాటు వెలిగే లైటు వెలుతురులోనే వీవీ ప్యాట్ స్లిప్ ను చూడగలరని పేర్కొంది. అందువల్ల ఎన్నికల సంఘం తిరిగి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.

దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈవీఎంల పనితీరును అర్థం చేసుకొనేందుకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ తో సుమారు గంటపాటు చర్చించింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మణీసిందర్ సింగ్ పిటిషనర్ల వాదనను తోసిపుచ్చారు. ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేసే యంత్రాలని చెప్పారు. అయితే వాటిలో మానవ పొరపాటుకు అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు.

అంతకుముందు ఈ నెల 16న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషనర్ల తీరుపై మండిపడింది. ఈవీఎంలపై విమర్శలు, బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలన్న డిమాండ్ ను తప్పుబట్టింది. దేశంలో ఎన్నికల ప్రక్రియను అతిభారీ కసరత్తుగా అభివర్ణించింది. ఈ వ్యవస్థను కిందకు పడేసే ప్రయత్నాలు చేయకూడదని సూచించింది.

వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్) అనేది ఒక స్వతంత్ర ఓటు ధ్రువీకరణ వ్యవస్థ. ఇది ఓటర్లు తమ ఓట్లు సరిగ్గా పోలయ్యాయో లేదో చూసేందుకు వీలు కల్పిస్తుంది.
EVM
Supreme Court
Election Commission
vvpat

More Telugu News